Petrol : దేశంలో డిజిటల్ లావాదేవీలను మరింత క్రమబద్ధీకరించే క్రమంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ద్వారా జరిపే చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) నిబంధనల్లో స్పష్టత వచ్చింది.
పెట్రోల్ బంకులు మరియు కొన్ని ఎంపిక చేసిన సేవలలో రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన UPI లావాదేవీలపై గరిష్టంగా రూ.5ల ఫ్లాట్ MDR ఛార్జీ వర్తిస్తుంది. గతంలో ఉన్న పర్సంటేజీ (0.4%) విధానానికి భిన్నంగా ఈ నిర్ణీత రుసుమును నిర్ణయించారు. అత్యంత ముఖ్యమైన విషయమేమిటంటే, ఈ ఛార్జీని కస్టమర్లు చెల్లించాల్సిన అవసరం లేదు; కేవలం వ్యాపారులు (మర్చంట్లు) మాత్రమే భరిస్తారు. ఇకపోతే, రూ.2,000 లోపు జరిపే సాధారణ డిజిటల్ లావాదేవీలకు ఎలాంటి MDR లేదా అదనపు ఛార్జీలు వర్తించవు.

ఫ్లాట్ MDR వర్తించే సేవలు మరియు వ్యాపారులకు ఊరట
ఈ రూ.5 ఫ్లాట్ MDR నిబంధన కేవలం పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లకు మాత్రమే కాకుండా పలు నిత్యవసర సేవలకు కూడా విస్తరించింది. రైల్వే టికెట్ల బుకింగ్, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులు, టెలికం రంగానికి చెందిన బిల్లులు, విద్యుత్, మంచి నీరు, పైప్డ్ గ్యాస్ సేవలు, అకడమిక్ ఫీజులు మరియు ఆటో-పే (Auto-Pay) విధానంలో జరిగే లావాదేవీలు ఈ జాబితాలో ఉన్నాయి. సాధారణంగా శాతం ప్రాతిపదికన MDR లెక్కిస్తే పెద్ద మొత్తాల లావాదేవీలపై వ్యాపారులకు భారీగా ఛార్జీలు పడేవి. అయితే, గరిష్టంగా ₹5 పరిమితి విధించడం వల్ల బంక్ యజమానులతో పాటు ఇతర సేవా రంగా వ్యాపారులకు ఆర్థిక భారం తగ్గి ఊరట లభించినట్లయింది.

