Palnadu Murder Case: అనుమానం పెనుభూతమై ఓ యువతి ప్రాణాలను బలిగొంది. ఐదేళ్లుగా ప్రాణంగా ప్రేమించిన ప్రేమికుడే, కాలకూట విషమై మారాడు. ఉద్యోగం వచ్చిందనే నెపంతో తనను దూరం పెడుతోందనే కక్షతో, మాట్లాడదామని పిలిపించి అత్యంత దారుణంగా కత్తితో పొడిచి హత్య చేసి, అనంతరం సాక్ష్యాలు లభించకుండా మృతదేహానికి నిప్పుపెట్టిన ఘోర సంఘటన పల్నాడు జిల్లాలో వెలుగుచూసింది.
మాట్లాడదామని పిలిచి కత్తితో దాడి
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లాకు చెందిన హసీనా, బాల సైదులు గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల హసీనాకు ఉద్యోగం రావడంతో, ఆమె తనను పట్టించుకోవడం లేదని, దూరం పెడుతోందని బాల సైదులు తీవ్ర అనుమానం పెంపొందించుకున్నాడు. ఈ క్రమంలోనే మాట్లాడాలని చెప్పి హసీనాను కారంపూడి మండలం ఇనుపరాజుపల్లి కాలువ కట్ట వద్దకు పిలిపించాడు. అక్కడే ఇద్దరి మధ్య మాటమాట పెరగడంతో, ముందస్తు పథకం ప్రకారం తెచ్చుకున్న కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు.
Palnadu Murder Case: పెట్రోల్ పోసి మృతదేహం దగ్ధం
హత్య అనంతరం పోలీసులకు ఆధారాలు లభించకుండా ఉండేందుకు నిందితుడు బాల సైదులు మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. కాగా, కుమార్తె కనిపించకపోవడంతో హసీనా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు కాలువ కట్ట వద్ద సగం కాలిన స్థితిలో ఉన్న హసీనా మృతదేహం లభ్యమైంది.
సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా ఆధారంగా నిందితుడు బాల సైదులును అదుపులోకి తీసుకుని విచారించగా, తనే హత్య చేసినట్లు నేరం ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు
Epaper: epaper.vaartha.com

