V Hanumantha Rao: భారత జాతీయ పతాకాన్ని రూపొందించిన మహోన్నత వ్యక్తి పింగళి వెంకయ్యకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'భారతరత్న' ప్రకటించాలని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ సలహాదారుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు (వీహెచ్) డిమాండ్ చేశారు.
కోట్లాది మంది పౌరుల గుండెల్లో నిలిచిన త్రివర్ణ పతాకాన్ని అందించిన ఆ గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వగల అతిపెద్ద సముచిత నివాళి భారతరత్న మాత్రమేనని స్పష్టం చేస్తూ ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి ఓ బహిరంగ లేఖ రాశారు.

'హర్ ఘర్ తిరంగా'పై స్పందిస్తూనే కేంద్రంపై విమర్శలు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'హర్ ఘర్ తిరంగా' పిలుపును తాము స్వాగతిస్తున్నామని, అయితే అదే సమయంలో జాతీయ జెండా రూపకర్త పట్ల కేంద్రం చూపుతున్న నిర్లక్ష్యాన్ని వీహెచ్ తీవ్రంగా ఎండగట్టారు. దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడుతున్న సమయంలో, ఆ జెండాకు రూపకల్పన చేసిన తెలుగు నేల ముద్దుబిడ్డ పింగళి వెంకయ్య సేవలను ప్రధాని మోదీ ఎందుకు విస్మరిస్తున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు.
V Hanumantha Rao: సమరయోధుల త్యాగాలకు సరైన గౌరవం ఇదే
పింగళి వెంకయ్యకు భారతరత్న పురస్కారం అందిస్తేనే ప్రతి భారతీయుడికి, దేశం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు అసలైన గౌరవం దక్కుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో తాను స్వయంగా హైదరాబాద్‌లో పింగళి వెంకయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వీహెచ్ గుర్తుచేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, ఈ మహత్తర నిర్ణయం తీసుకోవాలని ఆ లేఖ ద్వారా గట్టిగా కోరారు.
Epaper: epaper.vaartha.com

