Pithapuram : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది.
నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఏర్పాటు చేసిన పిఠాపురం ప్రాంత అభివృద్ధి అథారిటీ (పాడా – PADA)కి స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రత్యేక సంస్థగా గుర్తింపునిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఈ అథారిటీ ప్రత్యేక అధికారాలతో వ్యవహరించనుంది. ఈ నిర్ణయంతో పిఠాపురం పరిధిలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల అభివృద్ధికి నిధుల మంజూరు, ప్రాజెక్టుల రూపకల్పన మరియు నిర్వహణలో మరింత వేగం పుంజుకోనుంది.

శరవేగంగా అభివృద్ధి పనులు: మోడల్ నియోజకవర్గంగా పిఠాపురం
పిఠాపురం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక మోడల్ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే పలు మౌలిక వసతుల కల్పన పనులు శరవేగంగా సాగుతున్నాయి. ‘పాడా’కు స్వయం ప్రతిపత్తి లభించడంతో నిధుల వినియోగం, అనుమతుల ప్రక్రియ సులభతరం కానుంది. కాకినాడ జిల్లా కలెక్టర్ నేరుగా దీని కార్యకలాపాలను పర్యవేక్షించనున్నందున డ్రెయిన్ వ్యవస్థ, రోడ్ల విస్తరణ, తాగునీటి ప్రాజెక్టులు మరియు పర్యాటక రంగాల ప్రణాళికలు త్వరితగతిన పూర్తి కానున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించిన ఈ నియోజకవర్గంలో తాజా ఉత్తర్వులు ప్రజలకు తీవ్ర ఆనందాన్ని కలిగిస్తున్నాయి.

