Kids Health Tips: ఉదయం 7 గంటలయ్యిందంటే చాలు వీధుల్లో స్కూల్ బస్సుల హారన్ల శబ్దాలు మారుమోగిపోతుంటాయి. బడి పిల్లలున్న ప్రతి ఇంట్లోనూ ఆ సమయానికి తల్లిదండ్రులు, పిల్లలు పరుగులు పెట్టడం సర్వసాధారణం.
రాత్రి రాసిన హోంవర్క్ బుక్స్ సర్దుకుంటూ, స్కూల్ బ్యాగులు సిద్ధం చేసుకునే హడావుడి ఒకవైపు ఉంటే.. మరోవైపు వంటగదిలో అమ్మ టిఫిన్, మధ్యాహ్నం లంచ్ కోసం వేగంగా వంట చేస్తుంటుంది. అయితే, సమయం గడిచిపోతుందనే ఒత్తిడిలో చాలామంది తల్లులు వేడివేడి వంటకాలను నేరుగా ప్లాస్టిక్ లంచ్ బాక్సులలో సర్దేస్తుంటారు. ఆ కాసేపటి హడావుడిలో తాము చేస్తున్న ఈ చిన్న పొరపాటు పిల్లల ఆరోగ్యాన్ని ఎంతలా ప్రమాదంలోకి నెడుతుందో తల్లిదండ్రులు గమనించడం లేదు. ప్లాస్టిక్ బాక్సుల వాడకం వల్ల పిల్లల ఆరోగ్యంపై పడే తీవ్ర ప్రభావాల గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం.
ప్లాస్టిక్ డబ్బాల్లో బిస్ఫినాల్ ముప్పు.. హెచ్చరిస్తున్న వైద్యులు!

ప్లాస్టిక్ డబ్బాల్లో వేడివేడి ఆహార పదార్థాలను ఉంచడం అత్యంత ప్రమాదకరమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
వైద్యుల హెచ్చరిక: ప్లాస్టిక్ తయారు చేయడానికి వాడే 'బిస్ఫినాల్' (BPA) వంటి ప్రమాదకరమైన రసాయనాలు వేడి తగలగానే సులభంగా కరిగి ఆహారంలో కలిసిపోతాయని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు (పీడియాట్రీషియన్) డాక్టర్ ఆది శ్రీనివాస్ తెలిపారు.
ఇలాంటి రసాయనాలతో కూడిన ఆహారాన్ని పిల్లలు ప్రతిరోజూ తినడం వల్ల వారి శరీరంలో హార్మోన్ల సమతుల్యత తీవ్రంగా దెబ్బతింటుంది. ఇది దీర్ఘకాలంలో పెద్ద ఆరోగ్య సమస్యలకు దారితీయడమే కాకుండా, చిన్న వయసులోనే పిల్లల్లో నాడీ సంబంధిత సమస్యలు, జ్ఞాపకశక్తి మందగించడం, ఏకాగ్రత లోపం (Lack of Concentration) వంటి తీవ్రమైన రుగ్మతలకు కారణమవుతుందని ఆయన హెచ్చరించారు.
స్కూల్ లంచ్ బాక్స్: ఏ మెటీరియల్ సురక్షితం?
పిల్లల ఆరోగ్యాన్ని రక్షించడంలో లంచ్ బాక్స్ ఎంపిక కీలక పాత్ర పోషిస్తుంది. మార్కెట్లో లభించే వివిధ రకాల బాక్సుల గుణగణాలు ఇవే:
1. స్టెయిన్‌లెస్ స్టీల్ బాక్సులు (Stainless Steel) - బెస్ట్ ఛాయిస్
పిల్లలకు భోజనం పెట్టడానికి స్టెయిన్‌లెస్ స్టీల్ బాక్సులు అత్యంత సురక్షితమైనవని డాక్టర్లు సిఫార్సు చేస్తున్నారు. వీటి ద్వారా ఎలాంటి రసాయనాలు ఆహారంలో కలవవు. అంతేకాకుండా, ఇవి ఆహారంలోని సహజ పోషకాలను అలాగే ఉంచుతాయి. "మా పిల్లలు ఐదో తరగతి చదువుతున్నారు. డాక్టర్ల సలహా మేరకు ప్లాస్టిక్ మానేసి స్టెయిన్‌లెస్ స్టీల్ బాక్సులు వాడుతున్నాం. పిల్లల ఆరోగ్యమే మాకు ముఖ్యం" అని ఆర్మూర్‌కు చెందిన స్నేహలత అనే తల్లి తన అనుభవాన్ని పంచుకున్నారు.
2. గాజు కంటైనర్లు (Glass Containers)
పెద్ద వయసు పిల్లలకు గాజు (గ్లాస్) బాక్సులు, సీసాలు ఇవ్వవచ్చు. వీటిలో రసాయనాలు ఉండవు మరియు ఆహారానికి ఎలాంటి రంగు, వాసన అంటవు. వీటిని శుభ్రం చేయడం కూడా చాలా సులభం. అయితే, ఇవి త్వరగా పగిలిపోయే అవకాశం ఉన్నందున పిల్లలకు తగిన జాగ్రత్తలు చెప్పి పంపాలి. లేదా నాణ్యమైన ఇన్సులేటెడ్ బాక్సులను ఎంచుకోవాలి.
3. సిలికాన్ మరియు వెదురు బాక్సులు (Silicone & Bamboo)
- సిలికాన్ కంటైనర్లు: ఇవి మడతపెట్టడానికి (Collapsible) అనుకూలంగా, సౌకర్యవంతంగా ఉంటాయి. ఇవి 100% బీపీఏ రహితమైనవి మరియు సురక్షితమైనవి.
- వెదురు (బ్యాంబూ) బాక్సులు: ఇవి పర్యావరణ హితంగా, ఆరోగ్యకరంగా ఉంటాయి. అయితే, వీటిలో కేవలం బ్రెడ్, శాండ్‌విచ్ వంటి పొడి పదార్థాలను మాత్రమే పెట్టాలి. లిక్విడ్ లేదా జిగురుగా ఉండే ఆహార పదార్థాలకు ఇవి పనికిరావు.
Kids Health Tips: తల్లిదండ్రులు, పాఠశాలలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- మెటీరియల్ చెక్ చేయండి: మార్కెట్లో లంచ్ బాక్స్ కొనేటప్పుడు కేవలం 'బీపీఏ ఫ్రీ' అని రాసి ఉన్నంత మాత్రాన నమ్మకూడదు, అందులో ఇతర హానికర రసాయనాలు ఉండవచ్చు. కాబట్టి మెటీరియల్ నాణ్యతను పరిశీలించాలి.
- కఠినమైన స్క్రబ్బర్లు వద్దు: ప్లాస్టిక్ లేదా ఇతర బాక్సులను శుభ్రం చేసేటప్పుడు గరుకైన, కఠినమైన స్క్రబ్బర్లను వాడకూడదు. దీనివల్ల డబ్బా లోపలి ఉపరితలం దెబ్బతిని, రసాయనాలు ఆహారంలోకి మరింత వేగంగా చేరుతాయి.
- పాఠశాలల బాధ్యత: స్కూల్స్ కూడా పిల్లలకు ప్లాస్టిక్ బాక్సులు, వాటర్ బాటిల్స్ వల్ల జరిగే నష్టాలను వివరిస్తూ అవగాహన సదస్సులు నిర్వహించాలి. స్టీల్ బాక్సులు వాడేలా విద్యార్థులను ప్రోత్సహించాలి.
Epaper: epaper.vaartha.com

