Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఆయన నేడు ఒకేరోజు మూడు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు.
చారిత్రాత్మక సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి సంబంధించి 117 క్రెస్ట్ గేట్ల ఆధునికీకరణ పనులను ఆయన అధికారికంగా ప్రారంభిస్తారు. అనంతరం ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.

రూ.152.95 కోట్లతో కాటన్ బ్యారేజీ ఆధునికీకరణ
ముఖ్యమంత్రి ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణ లక్ష్యంగా తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి, కోనసీమ జిల్లా పరిధిలోని పిచ్చుకలంక వద్దకు చేరుకుంటారు. అక్కడ బ్యారేజీ గేట్ల మార్పిడి పనులకు శంకుస్థాపన చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. దీని తర్వాత గోదావరి డెల్టా రైతులతో ముఖాముఖి సమావేశమై, వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుంటారు.
కేంద్ర జలసంఘం (CWC), డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ సిఫార్సుల మేరకు రూ. 152.95 కోట్ల భారీ అంచనా వ్యయంతో ఈ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. బ్యారేజీకున్న 117 పాత వరద గేట్లను తొలగించి, వాటి స్థానంలో సరికొత్త గేట్లను అమర్చనున్నారు. 2028 జూలై నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం గడువుగా పెట్టుకుంది. ఈ ఆధునికీకరణ పనులు పూర్తయితే గోదావరి డెల్టా పరిధిలోని దాదాపు 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి సరఫరా మరింత సులభతరం కానుంది.
Chandrababu Naidu: పోలవరం క్షేత్రస్థాయి పరిశీలన
రైతులతో సమావేశం ముగిసిన వెంటనే చంద్రబాబు హెలికాప్టర్‌లో ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ ఈసీఆర్‌ఎఫ్ (ECRF) డ్యామ్, డయాఫ్రమ్ వాల్‌తో పాటు ప్రధాన కాలువల పనుల తాజా పరిస్థితిని స్వయంగా పరిశీలిస్తారు. విదేశీ నిపుణుల కమిటీ సూచనలు, నాణ్యతా ప్రమాణాలపై నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో ప్రాజెక్టు సైట్ వద్దే అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు.

