Telangana : తెలంగాణలో 7,437 పోలీసు ఉద్యోగాలకు సన్నాహాలు చేస్తున్న అభ్యర్థులకు టీ-సాట్ (T-SAT) నెట్‌వర్క్ తీపి కబురు అందించింది. పోలీస్ కాన్స్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న యువత కోసం టీ-సాట్ ద్వారా ఉచిత డిజిటల్ కంటెంట్ మరియు ప్రత్యేక లైవ్ శిక్షణ కార్యక్రమాలను అందుబాటులోకి తెస్తున్నట్లు టీ-సాట్ సీఈఓ బొదనపల్లి వేణుగోపాల్ రెడ్డి వెల్లడించారు.
రేపటి నుంచి ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు సంబంధిత సబ్జెక్టు నిపుణులతో నేరుగా లైవ్ ప్రసారాలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకుంటూ నాణ్యమైన శిక్షణ పొందేలా ఈ ప్రత్యక్ష ప్రసారాలను రూపాందించారు.

పరీక్షల వరకు 600 గంటల కంటెంట్ ప్రసారం: సమగ్ర ప్రణాళిక
అభ్యర్థుల సమగ్ర సన్నాహకం కోసం దాదాపు 600 గంటల రికార్డెడ్ డిజిటల్ కంటెంట్‌ను ప్రసారం చేయనున్నట్లు సీఈఓ స్పష్టం చేశారు. ఈ కంటెంట్‌ను టీ-సాట్ ‘విద్య’ ఛానెల్‌లో ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు మరియు ‘నిపుణ’ ఛానెల్‌లో ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు ప్రసారం చేయనున్నారు. ఈ శిక్షణా ప్రసారాలు పోలీస్ నియామక పరీక్షలు ముగిసే తేదీ వరకు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని గ్రామీణ, పేద విద్యార్థులకు ఈ ఉచిత డిజిటల్ లైవ్ తరగతులు ఎంతో మేలు చేకూరుస్తాయని స్పష్టం చేశారు.

