Mudragada Padmanabham Funeral: కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనను ఆయన కుటుంబ సభ్యులు తిరస్కరించారు.
ముద్రగడ బతికున్న సమయంలో ఆయన్ను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసి, అవమానించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆయన మరణించాక ఇచ్చే అధికారిక గౌరవాలు, సానుభూతులు తమకు అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Read Also : Mudragada Died : ముద్రగడకు నివాళి అర్పించనున్న జగన్
Mudragada’s family says no to state honors for the funeral.
Mudragada Padmanabham Funeral: ప్రభుత్వ నిర్ణయం.. సీఎం చంద్రబాబు సంతాపం
ముద్రగడ పద్మనాభం మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ముద్రగడ సమాజానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఈ ప్రతిపాదనను ముద్రగడ కుటుంబం తోసిపుచ్చింది.
మొసలి కన్నీరు అవసరం లేదు: జక్కంపూడి రాజా
కాకినాడ జిల్లా కిర్లంపూడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) నేత జక్కంపూడి రాజా మీడియాతో మాట్లాడుతూ ముద్రగడ కుటుంబ సభ్యుల నిర్ణయాన్ని వెల్లడించారు. ముద్రగడ గారు బతికున్నప్పుడు ఆయన్ను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు ఆయన మరణించాక ప్రభుత్వాలు మొసలి కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు. అందుకే ప్రభుత్వ అధికారిక లాంఛనాలు మాకు వద్దని ఆయన కుటుంబ సభ్యులు తేల్చిచెప్పారు అని జక్కంపూడి రాజా పేర్కొన్నారు. ముద్రగడ పద్మనాభం ఎన్నడూ అధికారం కోసం ఆశపడలేదని, కేవలం ప్రజా సమస్యల పరిష్కారం కోసమే తన జీవితాంతం పోరాడిన గొప్ప నాయకుడని జక్కంపూడి రాజా కొనియాడారు. కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు ఎలాంటి ప్రభుత్వ లాంఛనాలు లేకుండానే, కేవలం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానుల సమక్షంలో ముద్రగడ అంతిమ సంస్కారాలు జరగనున్నాయి.

