TG Govt : రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రీ-ప్రైమరీ (LKG, UKG) పాఠశాలల పనివేళల మార్పుపై విద్యాశాఖ తీవ్రంగా యోచిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ ప్రీ-ప్రైమరీ పాఠశాలలు మధ్యాహ్నం వరకు మాత్రమే పనిచేస్తుండటంతో, ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మధ్యాహ్నాన్నే పిల్లలను ఇంటికి తీసుకురావడం కుదరక, చాలామంది తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపుతున్నారు. ఈ క్రమంలో, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ ప్రీ-ప్రైమరీ సెక్షన్లను కూడా సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించాలని పలువురు తల్లిదండ్రుల నుంచి విజ్ఞప్తులు, డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేట్ విద్యాసంస్థలతో పోటీపడటంతో పాటు వర్కింగ్ పేరెంట్స్‌కు ఉపశమనం కలిగించే దిశగా పాఠశాల వేళలను సాయంత్రం వరకు పొడిగించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది.

నివేదిక ఆధారంగా మధ్యాహ్న భోజనం, ఉపాధ్యాయుల భారంపై స్పష్టత
ఈ ప్రతిపాదనను సమగ్రంగా సమీక్షించడానికి విద్యాశాఖ ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. పాఠశాల పనివేళలను సాయంత్రం వరకు పెంచినట్లయితే చిన్న పిల్లలకు మధ్యాహ్న భోజన వసతి (Mid-day Meals), చిరుతిండి, విశ్రాంతి గదులు మరియు ఇతర మౌలిక వసతులు ఏ విధంగా కల్పించాలి? అనే అంశాలపై కమిటీ విశ్లేషించనుంది. దీనితో పాటు, సమయం పెంచడం వల్ల ప్రీ-ప్రైమరీ ఉపాధ్యాయులు, ఆయాలపై పడే పనిభారం ఎంత?దనపు సిబ్బంది నియామకం అవసరమా? అనే విషయాలను కూలంకషంగా పరిశీలించి ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. ఆ కమిటీ ఇచ్చే సూచనలు, నివేదిక ఆధారంగానే స్కూల్ టైమింగ్స్‌పై విద్యాశాఖ తుది నిర్ణయం తీసుకోనుంది.

