Bhogapuram Airport : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం) ప్రారంభోత్సవంతో ప్రపంచం దృష్టి అంతా ఇప్పుడు ఉత్తరాంధ్ర వైపే మళ్లిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
ఈ ప్రాంతపు దశాబ్దాల కలకు ప్రధాని నరేంద్ర మోదీ పూర్తి మద్దతునిచ్చి ఆ కలలకు రెక్కలు తొడిగారని ఆయన కొనియాడారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు నాంది పలికి, అసలైన విత్తనం వేసింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడేనని వివరించారు. ఉత్తరాంధ్ర ప్రజలు గర్వపడే రీతిలో సిద్ధమైన ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్, ఈ ప్రాంత భవిష్యత్తును పూర్తిగా మార్చివేయబోతోందని రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు.

అభివృద్ధికి సింహద్వారం: ఉపాధి, రవాణా రంగాల్లో నూతన శకం
భోగాపురం ఎయిర్‌పోర్ట్ కేవలం విమానాల రాకపోకలకే పరిమితం కాకుండా ఉత్తరాంధ్ర ఆర్థిక స్వరూపాన్ని మార్చే ఒక ప్రధాన “సింహద్వారం”లా ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. ఈ విమానాశ్రయం రాకతో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని స్థానిక యువతకు పెద్ద ఎత్తున ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. పర్యాటకం, ఐటీ, ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులతో పాటు ఏవియేషన్ శిక్షణ రంగాల్లో కూడా ఊహించని రీతిలో అవకాశాలు మెరుగవుతాయని పేర్కొన్నారు. రాబోయే తరాలకు ఈ ఎయిర్‌పోర్ట్ ఒక మైలురాయిగా నిలిచిపోతుందని, ప్రాంతీయ సమగ్ర అభివృద్ధికి ఇది బాటలు వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

