Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రయాణికుడి చివరి సెల్ఫీ వీడియో వైరల్‌

ప్రయాణికుడి చివరి సెల్ఫీ వీడియో వైరల్‌

వార్త 3 weeks ago

Uttarakhand Helicopter Crash: ఉత్తరాఖండ్‌లో ఆరుగురి ప్రాణాలు తీసిన హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించిన హృదయవిదారక దృశ్యం వెలుగులోకి వచ్చింది. ప్రమాదానికి ముందు ప్రయాణికుల్లో ఒకరు చిరునవ్వుతో తీసుకున్న సెల్ఫీ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

హెలికాప్టర్‌లో తన చివరి ప్రయాణానికి ముందు ఆయన కుటుంబ సభ్యులతో పంచుకున్న ఈ వీడియో అందరినీ కలచివేస్తోంది.

Read Also :Crashed Helicopter : ఉత్తరాఖండ్లో కూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి

టేకాఫ్‌కు ముందు సెల్ఫీ వీడియో

శుక్రవారం బద్రీనాథ్‌ నుంచి డెహ్రాడూన్‌ వైపు బయలుదేరిన ట్రాన్స్‌ భారత్‌ ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్‌ కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. టేకాఫ్‌కు ముందు ప్రయాణికుడు ప్రతాప్‌ బచిహళ్లి నింగరాజు (41) తన ఫోన్‌లో సెల్ఫీ వీడియో రికార్డు చేశారు. అందులో ఆయన చిరునవ్వుతో కనిపించారు. మంచుతో కప్పబడిన హిమాలయాల అందాలను కూడా వీడియో తీసి కుటుంబ సభ్యులకు పంపించారు. అయితే, అవే ఆయన కుటుంబానికి పంపిన చివరి వీడియోలుగా మిగిలిపోయాయి.

ఆరుగురి ప్రాణాలు తీసిన ప్రమాదం

అధికారుల వివరాల ప్రకారం.. ట్రాన్స్‌ భారత్‌ ఏవియేషన్‌ సంస్థకు చెందిన హెలికాప్టర్‌ శుక్రవారం మధ్యాహ్నం బద్రీనాథ్‌ నుంచి బయలుదేరింది. మంచు కురుస్తున్న సమయంలో ప్రయాణిస్తుండగా జోషిమఠ్‌ లోయ ప్రాంతంలో సంబంధాలు కోల్పోయింది. అనంతరం చమోలీ జిల్లాలోని చాయ్‌ గ్రామం సమీపంలో కొండను ఢీకొని కూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో ఉన్న ఐదుగురు ప్రయాణికులు, పైలట్‌ సహా మొత్తం ఆరుగురూ మరణించారు. మృతులను ప్రతాప్‌ బచిహళ్లి నింగరాజు, అరుణ్‌ సలుంఖే, సుధీర్‌ కె, హెచ్‌ఎస్‌ నటరాజ్‌, శంకరగౌడ వీబీగా గుర్తించారు. పైలట్‌ కెప్టెన్‌ హిమాన్షు సభర్వాల్‌ కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ప్రయాణికులంతా కర్ణాటకకు చెందినవారు కాగా, పైలట్‌ ఢిల్లీ నివాసి.

Uttarakhand Helicopter Crash: విమానయాన సంస్థపై చర్యలు.. దర్యాప్తు ప్రారంభం

ప్రమాదం నేపథ్యంలో ట్రాన్స్‌ భారత్‌ ఏవియేషన్‌ సంస్థకు చెందిన హెలికాప్టర్ల సేవలను ముందుజాగ్రత్త చర్యగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు, విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ (AAIB) ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారణ చేపట్టింది. విమానం నిర్వహణ రికార్డులు, సాంకేతిక వివరాలు, ఇతర ఆధారాలను పరిశీలించనున్నారు. డీజీసీఏ బృందం కూడా ప్రాథమిక అంచనా కోసం రంగంలోకి దిగింది. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు సమగ్ర దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించడంతో పాటు, వారి భౌతికకాయాలను స్వస్థలాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాదం హిమాలయ ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో హెలికాప్టర్‌ ప్రయాణాల భద్రతపై మరోసారి ఆందోళనలను రేకెత్తించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha