Karnataka crime: పట్టపగలే అందరూ చూస్తుండగానే కర్ణాటకలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. దక్షిణ కన్నడ జిల్లాలో ఓ యువతిని అత్యంత క్రూరంగా హత్య చేయడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.
బంట్లా తాలూకా బి.సి. రోడ్డులోని కేఎస్‌ఆర్‌టీసీ బస్ స్టాండ్‌లో గురువారం సాయంత్రం ఒక యువకుడు కొడవలితో విచక్షణారహితంగా దాడి చేసి, ఓ యువతి ప్రాణాలను బలితీసుకున్నాడు. ఏకపక్ష ప్రేమే ఈ దారుణానికి కారణమని ప్రాథమిక విచారణలో పోలీసులు వెల్లడించారు.
మృతురాలిని కక్కెపడవు గ్రామానికి చెందిన లావణ్య (21)గా పోలీసులు గుర్తించారు. ఆమె కల్లాడ్కలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తోంది. ఎప్పటిలాగే గురువారం సాయంత్రం తన డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు ఆమె బస్ స్టాండ్‌కు చేరుకుంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన నిందితుడు, ఆమెపై కొడవలితో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డాడు.
Young woman brutally murdered at Bantla bus stand!
karnataka crime: ప్రేమ పేరుతో వేధింపులు.. బస్సు దిగగానే దాడి
నిందితుడిని బెల్తంగడి తాలూకా ఓడిల్నాలకు చెందిన చేతన్ (22)గా పోలీసులు గుర్తించారు. అతడు లావణ్యకు దూరపు బంధువు అవుతాడు. గత కొంతకాలంగా ప్రేమ పేరుతో ఆమె వెంటపడుతూ తీవ్రంగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం లావణ్య కక్కెపడవు వెళ్లే బస్సు ఎక్కగా, నిందితుడు చేతన్ కూడా ఆమెను వెంబడించాడు. బస్సు దిగిన వెంటనే, తాను వెంట తెచ్చుకున్న కొడవలితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అనంతరం ఆయుధాన్ని అక్కడే పడేసి ఘటనా స్థలం నుండి పరారయ్యాడు. ఈ దాడికి సంబంధించిన భయానక దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఆసుపత్రికి తరలించినా దక్కని ప్రాణాలు.. పోలీసుల దర్యాప్తు
రక్తపు మడుగులో పడివున్న లావణ్యను స్థానికులు వెంటనే స్పందించి బంట్లా తాలూకా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సమాచారం అందుకున్న దక్షిణ కన్నడ ఎస్పీ కె. అరుణ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పరారీలో ఉన్న నిందితుడు చేతన్ కోసం ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించినట్లు ఆయన తెలిపారు. ఈ ఘోర ఉదంతంపై బంట్లా టౌన్ పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.
Epaper: epaper.vaartha.com

