Pritam and Pedro Web Series: డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ఎప్పుడూ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ సిరీస్‌లకు ఉండే క్రేజ్, ఆదరణ వేరు. తాజాగా అదే ఓటీటీ (OTT) రేసులోకి సరికొత్త సైబర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ప్రీతమ్ అండ్ పెడ్రో' వచ్చేసింది.
హిందీలో రూపొందిన ఈ సిరీస్‌లో వీర్ హిరానీ, అర్షద్ వార్సీ, విక్రాంత్ మస్సే ప్రధాన పాత్రలు పోషించారు. స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్టాత్మక సిరీస్, ఈ నెల 3వ తేదీ నుండి ప్రముఖ ఓటీటీ వేదిక ‘జియో హాట్ స్టార్’ (Jio Hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.
‘Preetham and Pedro’ Cyber Thriller Review!
Pritam and Pedro Web Series: కథ
గోవాలో తన తాతయ్యతో కలిసి నివసించే ప్రీతమ్ (వీర్ హిరానీ) ఒక వాక్యూమ్ క్లీనర్స్ సేల్స్ మేన్. ఒకరోజు అతని తాతయ్య ప్రాణంగా చూసుకునే పాత టేప్ రికార్డర్, కేసెట్ దొంగతనానికి గురవుతాయి. దానిపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ప్రీతమ్‌కు, అక్కడ ఏటీఎం దొంగతనం కేసులో బిజీగా ఉన్న పోలీస్ ఆఫీసర్ పెడ్రో (అర్షద్ వార్సీ) పరిచయమవుతాడు. టెక్ జీనియస్ అయిన ప్రీతమ్, ఆ ఏటీఎం దొంగలను పట్టుకోవడంలో పెడ్రోకు సహాయం చేస్తాడు. ఆ తర్వాత ఒక వివాదంలో పెడ్రో క్రైమ్ డిపార్ట్‌మెంట్ నుండి సైబర్ సెల్‌కు బదిలీ అవుతాడు. సైబర్ క్రైమ్స్‌పై ఏమాత్రం అవగాహన లేని పెడ్రో.. తన తాతయ్య టేప్ రికార్డర్ కనిపెడతాననే శరతుపై ప్రీతమ్ సహాయం కోరతాడు.
ఇదే సమయంలో స్పోర్ట్స్ మినిష్టర్ పదేళ్ల కొడుకు వినీత్ కిడ్నాప్‌కు గురవుతాడు. కిడ్నాపర్ 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేయడంతో, ఈ కేసును ఛేదించి మళ్లీ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌కు వెళ్లాలని పెడ్రో ప్లాన్ చేస్తాడు. అయితే ఈ కిడ్నాప్ వెనుక ఒక మైండ్ గేమ్ ఆడే జీనియస్ హ్యాకర్ ఉన్నాడని ప్రీతమ్ గుర్తిస్తాడు. ఆ హ్యాకర్‌కు, ప్రీతమ్ గతానికి ఉన్న సంబంధం ఏంటి? పెడ్రో జీవితంలోని విషాదకర సంఘటన ఏంటి? చివరికి ఆ బాలుడిని ఎలా కాపాడారు? అనేదే మిగతా కథ.
ట్విస్టులతో సాగే స్క్రీన్‌ప్లే..
ఈ కథ మొత్తం ఒక ప్రతీకారంతో రగిలిపోయే హ్యాకర్, పశ్చాత్తాపంతో ఉన్న మరో హ్యాకర్, వారి గతం తెలియని పోలీస్ ఆఫీసర్ పెడ్రో అనే మూడు ప్రధాన పాత్రల చుట్టూనే సాగుతుంది. ప్రస్తుత కథనంతో పాటు సందర్భానుసారంగా వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ సిరీస్‌పై ఉత్కంఠను పెంచుతాయి. కథలో సీరియస్‌నెస్ ఎక్కడా తగ్గకుండానే, మధ్యమధ్యలో ఇచ్చిన కామెడీ టచ్ బాగా వర్కవుట్ అయ్యింది. మనం చేసే చిన్న చిన్న తొందరపాటు పనులు అవతలి వారి జీవితాలను ఎలా నాశనం చేస్తాయో, అలా నష్టపోయిన బాధితుడే సాంకేతిక పరిజ్ఞానంతో శత్రువుగా మారితే ఎంత ప్రమాదకరమో దర్శకుడు స్క్రీన్‌పై అద్భుతంగా ఆవిష్కరించారు.
ఆధునిక స్మార్ట్‌ఫోన్లు, యాప్‌లు మరియు ఆన్‌లైన్ గేమ్‌లు మనుషుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో, నేరగాళ్లు వాటిని ఎలా ఆయుధాలుగా మార్చుకుంటున్నారో ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు. ముఖ్యంగా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు స్మార్ట్‌ఫోన్ల వల్ల ఎలాంటి ప్రమాదాల్లో పడుతున్నారనేది చూపించి, సమాజానికి మంచి సందేశాన్ని అందించారు.
ముగింపు
దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ తాను రాసుకున్న పాయింట్‌ను అంతే పట్టుగా, బలమైన స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించారు. ఎక్కడా అనవసరమైన సీన్స్ లేకుండా, ప్రతి ఎపిసోడ్ ఉత్కంఠ రేకెత్తించేలా ఎడిటింగ్ కూడా ఆయనే పర్ఫెక్ట్‌గా చూసుకున్నారు. అవినాశ్ అరుణ్ కెమెరా పనితనం ఇన్వెస్టిగేషన్ సీన్లను సహజంగా చూపించగా, సంజయ్ వాండ్రేకర్ అందించిన నేపథ్య సంగీతం (BGM) థ్రిల్లర్ మూడ్‌ను బాగా ఎలివేట్ చేసింది. నటీనటులందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఓవరాల్‌గా సైబర్ క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఇదొక మస్ట్ వాచ్ వెబ్ సిరీస్.

