Greater Noida: ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా పరిధిలో ఉన్న గ్రేటర్ నోయిడాలో శుక్రవారం తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. బిస్రాఖ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రసిద్ధ 'మహాగున్ మైవుడ్స్' లో చోటుచేసుకున్న ఈ ఘోర ప్రమాదంలో 40 ఏళ్ల తండ్రి, ఆయన 11 ఏళ్ల కుమారుడు 23వ అంతస్తు నుంచి కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఉదయాన్నే చేసే పూజ కోసం బాల్కనీ వద్ద పువ్వులు కోసే క్రమంలో జరిగిన చిన్న పొరపాటు ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది.
The flowers have gone to heaven.. to infinite worlds! The father also died after saving his son.
Greater Noida: కొడుకుని కాపాడే ప్రయత్నంలో తండ్రి కూడా..
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రణదీప్ పాత్రా (40), ఆయన 11 ఏళ్ల కుమారుడు ఆరవ్ ఇద్దరూ ఉదయాన్నే పూజ కోసం అపార్ట్‌మెంట్ బాల్కనీకి వెళ్లారు. అక్కడ పెంచుతున్న మొక్కల నుంచి పువ్వులు కోస్తున్న సమయంలో బాలుడు ఆరవ్ అకస్మాత్తుగా కాలుజారి బాల్కనీ నుంచి కింద పడిపోతుండటాన్ని తండ్రి గమనించాడు. వెంటనే తీవ్ర ఆందోళనతో గాలిలో వేలాడుతున్న కొడుకును రక్షించేందుకు ముందుకు దూకి చేయి పట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ, దురదృష్టవశాత్తూ పట్టు తప్పి తండ్రీకొడుకు ఇద్దరూ ఒక్కసారిగా 23వ అంతస్తు నుంచి కింద పడిపోయారు.
ఆసుపత్రికి తరలించేలోపే ఆగిపోయిన శ్వాస
విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు, స్థానికులు హుటాహుటిన పోలీసులకు, అంబులెన్సుకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం తీవ్రగాయాలతో పడి ఉన్న తండ్రీకొడుకులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే వారు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఆలయానికి వెళ్లే లోపే విషాదం
ప్రాథమిక విచారణలో భాగంగా మృతుని భార్య పోలీసులకు వాంగ్మూలం ఇస్తూ కన్నీటిపర్యంతమైంది. తాను శుక్రవారం ఉదయాన్నే ఖాటూ శ్యామ్ ఆలయ సందర్శనకు వెళ్లాల్సి ఉందని, తాను బయలుదేరే ముందే భర్త, కుమారుడు పూజకు అవసరమైన పువ్వులను తీసుకురావడానికి బాల్కనీ వైపు వెళ్లారని తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన బిస్రాఖ్ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు స్పష్టం చేశారు.

