Eleno effect: తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో వర్షాభావ పరిస్థితులు, నీటి కొరత ఏర్పడే అవకాశాలు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అప్రమత్తమైంది.
ఇప్పటికే సాగులో ఉన్న పంటలకు ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలపై దృష్టి సారించింది.
ఇందులో భాగంగా, రైతుల పంటలు చేతికొచ్చే వరకు విద్యుత్ కోతలు లేకుండా చూడాలని, సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
Read also: KTR New Look: 'ఆ మాత్రం ఉండాలి'.. న్యూ లుక్ పై కేటీఆర్ చమత్కారం
రాబోయే 8 నెలలు అత్యంత కీలకం
ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాబోయే ఎనిమిది నెలలు రాష్ట్రానికి అత్యంత కీలకమని సీఎం పేర్కొన్నారు. వ్యవసాయం, తాగునీరు, సాగునీరు మరియు విద్యుత్ సరఫరా విభాగాల్లో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం పొలాల్లో ఉన్న పంటలు చేతికి వచ్చేంత వరకు అవసరమైన నీటి లభ్యత ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
చుక్క నీరు కూడా వృథా కావొద్దు
రాష్ట్రంలోని నీటి వనరులను అత్యంత సమర్థవంతంగా వినియోగించుకోవాలని సీఎం సూచించారు. ఒక్క చుక్క నీరు కూడా వృథా కాకుండా ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అధికారులకు తేల్చి చెప్పారు. భవిష్యత్తులో నీటి కొరత తీవ్రం కాకుండా నీటి నిల్వలను జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు.
విద్యుత్ పొదుపుపై సీఎం కీలక సూచనలు
ఎల్‌నినో ప్రభావం వల్ల భవిష్యత్తులో విద్యుత్ డిమాండ్ ఊహించని రీతిలో పెరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. అవసరమైన విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ, ఓపెన్ మార్కెట్‌లో తగినంత విద్యుత్ అందుబాటులో ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. అందువల్ల ప్రస్తుతం అందుబాటులో ఉన్న విద్యుత్‌ను ఎంతో పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు అన్ని విధాలా అండగా నిలిచేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. రాబోయే నెలల్లో నీటి లభ్యత, విద్యుత్ సరఫరా పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తూ తగిన నిర్ణయాలు తీసుకోనున్నారు.

