CM Revanth Warning : రాబోయే ఎనిమిది నెలల కాలం తెలంగాణ రాష్ట్రానికి అత్యంత క్లిష్టంగా మారబోతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా మారుతున్న వాతావరణ పరిస్థితులు, ముఖ్యంగా 'ఎల్నినో' (El Niño) ప్రతికూల ప్రభావం వల్ల రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత అసాధారణ స్థాయిలో ఉండబోతోందని ఆయన హెచ్చరించారు.
భానుడి ప్రతాపానికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడమే గగనమయ్యే పరిస్థితులు తలెత్తుతాయని పేర్కొన్నారు. ప్రకృతి ప్రకోపంతో వచ్చే కరువు, విపత్తులను ఎవరూ నిలువరించలేరని, అయితే ముందుస్తు అప్రమత్తత మరియు సరైన ప్రణాళికతో మాత్రమే ఈ గండం నుంచి బయటపడగలమని స్పష్టం చేశారు. ప్రజలను ఆందోళనకు గురి చేయడం తమ ఉద్దేశం కాదని, ఎదురవ్వబోయే ‘క్యాన్సర్ లాంటి కఠిన సత్యాన్ని’ ముందే వివరించి సన్నాహాలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన వ్యాఖ్యానించారు.
రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. బియ్యంతో పాటు మరో 6 సరుకులు
తాగునీటికే ప్రథమ ప్రాధాన్యం - రైతాంగానికి సాగునీటి అభద్రత
ప్రస్తుతం ఉన్న జలాశయాల్లోని నీటి నిల్వలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నాలుగు నెలల పాటు వ్యవసాయ సాగుకు చుక్క నీరు కూడా విడుదల చేయడం సాధ్యపడదని సీఎం ఖరాఖండిగా చెప్పారు. “ప్రజలు తాగడానికి నీళ్లు లేని పరిస్థితి ఉన్నప్పుడు, వ్యవసాయానికి నీరు ఎలా ఇవ్వగలం?” అని వ్యాఖ్యానిస్తూ, ఉన్న కొద్దిపాటి జలవనరులను కేవలం తాగునీటి అవసరాలకే కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయంతో రాబోయే పంట కాలంలో రైతాంగానికి సాగునీటి కొరత తీవ్రంగా పీడించే అవకాశం కనిపిస్తోంది. తీవ్రమైన నీటి ఎద్దడి మరియు భానుడి భగభగలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలని, అలాగే ప్రజలు కూడా నీటిని అత్యంత పొదుపుగా వాడుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

