Kishan Reddy: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేసి, అస్థిరపరిచేందుకు ప్రతిపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని కేంద్ర మంత్రి జి.
కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలను ఆయన కేవలం “తాటాకు చప్పుళ్లు”గా అభివర్ణించారు. ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పును గౌరవించకుండా, దేశంలో అరాచకం సృష్టించి ప్రభుత్వాన్ని కూలదోయాలని విపక్షాలు పగటి కలలు కంటున్నాయని మండిపడ్డారు.

ప్రజాతీర్పును అవమానించడమే: విపక్షాల దుష్ప్రచారంపై మండిపాటు
హైదరాబాద్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. రాజ్యాంగం అందించిన ప్రజాస్వామ్య హక్కులను ప్రతిపక్షాలు తమ స్వార్థం కోసం దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపించారు. “పది నెలల్లో మోదీ సర్కార్ కూలిపోతుంది” అంటూ కొన్ని పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా మాట్లాడటం అంటే ప్రజాతీర్పును అవమానించడమేనని స్పష్టం చేశారు.
Kishan Reddy: విపక్షాల దింపుడుకల్లం ఆశలు ఎప్పటికీ నెరవేరవు
ప్రధానిగా నరేంద్ర మోదీ 2029 వరకు పూర్తిస్థాయిలో అధికారంలో కొనసాగాలని దేశ ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాల్లో ప్రభుత్వాలు మారినట్లుగానే ఇక్కడ కూడా చేయాలని విపక్షాలు దింపుడుకల్లం ఆశలతో ఉన్నాయని, వారి కలలు ఎప్పటికీ సాకారడవని ఎద్దేవా చేశారు. ప్రపంచ దేశాలు ఆర్థిక సంక్షోభంలో ఉన్నా, మోదీ నాయకత్వంలో భారత్ స్థిరమైన వృద్ధి సాధిస్తోందని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ తాటాకు చప్పుళ్లకు ప్రభుత్వం భయపడదు
ప్రభుత్వ అద్భుతమైన పనితీరును చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలతో కుట్రలకు పాల్పడుతున్నాయని కిషన్ రెడ్డి విమర్శించారు. రాహుల్ గాంధీ చేసే హెచ్చరికలు, తాటాకు చప్పుళ్లకు మోదీ ప్రభుత్వం ఏమాత్రం భయపడదని తేల్చిచెప్పారు. ఎన్డీయే ప్రభుత్వం అత్యంత పటిష్టంగా ఉందని, ఎలాంటి అవాంతరాలు లేకుండా తన పూర్తికాలాన్ని విజయవంతంగా పూర్తి చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Epaper: epaper.vaartha.com

