Rahul Sipligunj : ప్రముఖ సినీ గాయకుడు, ఆస్కార్ అవార్డు విజేత 'నాటు నాటు' పాటకు గొంతుకనిచ్చిన బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ చుట్టూ తీవ్ర వివాదం ముసురుకుంది.
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం ఎంవీపీ పోలీస్ స్టేషన్‌లో రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు అతని బావమరిది కర్పూరపు రాహుల్ రెడ్డి మరియు మరికొందరిపై ఒక యువతి తీవ్ర ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం ప్రకారం.. రాహుల్ రెడ్డి తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లొంగదీసుకున్నాడని, గర్భవతిని చేసి అబార్షన్ చేయించాడని పేర్కొంది. ఆ తర్వాత పెళ్లి ప్రస్తావన తీసుకురాగా, తన పర్సనల్ ఫొటోలు, ప్రైవేట్ వీడియోలను సోషల్ మీడియాలో లీక్ చేస్తానని భయభ్రాంతులకు గురిచేస్తూ బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడని బాధితురాలు ఆరోపించింది.

మధ్యవర్తిత్వం పేరిట బెదిరింపులు: సమగ్ర విచారణ చేపట్టిన పోలీసులు
ఈ వివాదంలో ప్రధాన నిందితుడు రాహుల్ రెడ్డికి మద్దతుగా గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ రంగంలోకి దిగినట్లు బాధితురాలు తెలిపింది. రాహుల్ రెడ్డికి బంధువుగా పరిచయం చేసుకున్న రాహుల్ సిప్లిగంజ్, తన అనుచరులతో కలిసి తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చి, బెదిరింపులకు పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేసింది. బలవంతంగా వీడియో స్టేట్‌మెంట్లు ఇప్పించడమే కాకుండా, తన ఆత్మగౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు విశాఖ ఎంవీపీ కాలనీ పోలీసులు రాహుల్ సిప్లిగంజ్, రాహుల్ రెడ్డితో పాటు మొత్తం 12 మందిపై బెదిరింపులు, మోసం, సైబర్ వేధింపుల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.

