Ramayana movie: అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం 'రామాయణం' (Ramayana) నుంచి మేకర్స్ వరుస అప్‌డేట్లతో అంచనాలను ఆకాశానికి పెంచుతున్నారు.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించి అయోధ్య రాజసౌధంలో అంతర్గత రాజకీయాలకు, కథా మలుపునకు కేంద్ర బిందువుగా నిలిచే మహారాణి కైకేయి, మంథర పాత్రల అధికారిక క్యారెక్టర్ పోస్టర్లను చిత్రబృందం విడుదల చేసింది.
నితీష్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ చిత్రంలో కైకేయి పాత్రలో ప్రముఖ నటి లారా దత్తా నటిస్తుండగా, ఆమెకు కుట్రపూరిత ఆలోచనలు నూరిపోసే మంథర పాత్రలో సీనియర్ నటి షీబా చద్దా కనిపించనున్నారు.
Read Also : Fouji Movie: రెబల్ స్టార్ బర్త్‌డే స్పెషల్.. 'ఫౌజీ' గ్లింప్స్ రిలీజ్?
Poster of Lara Dutta as Kaikeyi in 'Ramayana' released.
Ramayana movie: ఆకట్టుకుంటున్న లారా దత్తా, షీబా చద్ధా లుక్స్
విడుదలైన పోస్టర్‌లో లారా దత్తా ఎంతో రాజసం ఉట్టిపడేలా సంప్రదాయ వస్త్రధారణ, రాచరికపు ఆభరణాలు మరియు కిరీటంతో కనువిందు చేస్తున్నారు. ఆమె ముఖంలో ఒక వైపు రాచరికపు గాంభీర్యం, మరొక వైపు తీవ్రమైన ఆందోళనతో కూడిన భావాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక మంథర పాత్ర పోషిస్తున్న షీబా చద్ధా ముదురు రంగు దుస్తులు, సాంప్రదాయ వెండి ఆభరణాలు ధరించి, చేతిలో కర్ర పట్టుకుని కుట్రపూరితమైన చూపులతో విలక్షణమైన రూపంలో ఆకట్టుకుంటున్నారు.
‘రాముడి తలరాతను మార్చేసే రెండు కోరికలు..’ మేకర్స్ పవర్‌ఫుల్ క్యాప్షన్
ఈ పోస్టర్లను పంచుకుంటూ మేకర్స్ సోషల్ మీడియాలో ఇచ్చిన క్యాప్షన్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
“ఒక రాణి.. ఒక తల్లి.. తండ్రి ప్రేమను వంచించి, రాముడి తలరాతను మార్చేసే రెండు కోరికలు. ఒక కుట్రపూరితమైన మనసు.. ఆమె ఊహాగానాలు ఒక తల్లి ప్రేమను రాజ్యానికి చీకటి రోజులుగా మార్చేస్తాయి” అంటూ ఈ పాత్రల ప్రాధాన్యతను చాటిచెప్పారు.
'రామాయణం'లో నటీనటులు.. విడుదల తేదీలు ఖరారు!
భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రంలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తుండగా.. రావణాసురుడి పాత్రను యశ్ పోషిస్తున్నారు. హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే, దశరథ మహారాజుగా అరుణ్ గోవిల్ ప్రేక్షకులను అలరించనున్నారు.
ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మొదటి భాగాన్ని 2026 దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్ర బృందం ప్రణాళిక రూపొందించగా.. రెండో భాగాన్ని 2027 దీపావళి కానుకగా థియేటర్లలోకి తీసుకురానున్నారు. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

