
Medak Road Accident: మండల పరిధిలోని కమలాపూర్ శివారులోని జాతీయ రహదారి-161పై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు.
పెద్ద శంకరంపేట ఎస్సై ప్రవీణ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కల్హేర్ మండలం మార్డి గ్రామానికి చెందిన కమ్మరి గణేష్ (43) ఆదివారం సాయంత్రం తన హోండా షైన్ ద్విచక్ర వాహనంపై శంకరంపేట నుంచి మార్డి వైపు వెళ్తుండగా కమలాపూర్ శివారులోని రైస్ మిల్ సమీపంలో రాంగ్‌రూట్‌లో ప్రయాణించాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ఐచర్ వాహనo ఢీకొనడంతో గణేష్ తలకు తీవ్ర గాయాలయ్యాయి.
Medak Road Accident: స్థానికులు వెంటనే అతడిని జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య కమ్మరి స్వప్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమాదానికి రాంగ్‌రూట్‌లో ప్రయాణించడమే కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
Epaper: epaper.vaartha.com

