Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాప్తాడు ఘటన నిందితుడి ఆరోగ్య పరిస్థితి విషమం.. ఎస్పీ కీలక ప్రకటన!

రాప్తాడు ఘటన నిందితుడి ఆరోగ్య పరిస్థితి విషమం.. ఎస్పీ కీలక ప్రకటన!

వార్త 3 weeks ago

Rapthadu Incident: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఈ ఘటన తర్వాత పరారీలో ఉన్న నిందితుడు హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించిన సమయంలో పోలీసులపై కత్తితో దాడికి యత్నించడంతో కాల్పులు జరపాల్సి వచ్చిందని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ వెల్లడించారు. ఈ ఘటనలో హేమంత్ తీవ్రంగా గాయపడగా, అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.

Read Also :Hyderabad Crime: కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య.. ఆర్థిక ఇబ్బందులే కారణమా?

25 బృందాలతో గాలింపు.. అటవీ ప్రాంతంలో గుర్తింపు

రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో శనివారం జరిగిన దాడి అనంతరం నిందితుడు హేమంత్ కోసం పోలీసులు 25 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం అతడు ఆత్మకూరు అటవీ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో రెండు పోలీసు బృందాలు అక్కడికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించాయి. అయితే పోలీసులను గమనించిన హేమంత్ పారిపోయేందుకు ప్రయత్నించడంతో పాటు ప్రతిఘటించినట్లు ఎస్పీ తెలిపారు. పోలీసులు తొలుత గాల్లోకి కాల్పులు జరిపి హెచ్చరించినా అతడు వెనక్కి తగ్గలేదని చెప్పారు. తన వద్ద ఉన్న కత్తితో పోలీసులపై దాడికి ప్రయత్నించాడని, ఈ క్రమంలో ఒక సీఐపై దాడి చేసి గాయపరిచాడని వివరించారు.

ఆరు రౌండ్లు కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు

హెచ్చరికలను పట్టించుకోకుండా సీఐపై కత్తితో దాడి చేయడంతో పోలీసులు కాల్పులు జరిపినట్లు ఎస్పీ జగదీష్ వెల్లడించారు. మొత్తం ఆరు రౌండ్ల వరకు కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఈ ఘటనలో హేమంత్ తీవ్రంగా గాయపడటంతో వెంటనే అనంతపురం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు అతడిని పట్టుకునేందుకు వెళ్లిన సమయంలో మద్యం మత్తులో ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారని ఎస్పీ పేర్కొన్నారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారని, నిందితుడి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మరోవైపు, ఆస్పత్రి వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ జగదీష్ ఆస్పత్రికి వెళ్లి వైద్యులను కలిసి హేమంత్ ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు.

Rapthadu Incident: బాలికకు బెంగళూరులో చికిత్స

రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలోని తరగతి గదిలోకి ప్రవేశించిన హేమంత్.. పదో తరగతి విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనతో పాఠశాలలోని విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో లక్ష్మి అనే విద్యార్థిని నిందితుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా, ఆమె రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన బాలికను తొలుత అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బెంగళూరుకు వెళ్లి బాలికను, ఆమె తల్లిదండ్రులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ఈ ఘటనతో రాప్తాడు ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది. బాలికకు చికిత్స కొనసాగుతుండగా, నిందితుడి ఆరోగ్య పరిస్థితిపై కూడా వైద్యులు పర్యవేక్షణ చేస్తున్నారు.

కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య.. ఆర్థిక ఇబ్బందులే కారణమా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha