Kodali Nani: యూట్యూబర్ రావణ్ అరెస్ట్ ఉదంతంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) సీనియర్ నేత, మాజీ మంత్రి కొడాలి నాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
రాష్ట్రంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజల గొంతు నొక్కేందుకు కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.

‘ఉప్మా, ఇడ్లీ చట్టాలు’ తెచ్చి జైల్లో పెడుతున్నారు: కొడాలి నాని
ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారిని, విమర్శించే వారిని అణచివేయడమే లక్ష్యంగా కొత్త కొత్త చట్టాలను వాడుతున్నారని కొడాలి నాని మండిపడ్డారు. రావణ్ అరెస్ట్‌ను ప్రస్తావిస్తూ… ‘యూఏపీఏ’ (UAPA) లాంటి కఠిన చట్టాలను ఉద్దేశించి, ఆయన వ్యంగ్యంగా “ఉప్మా చట్టం, ఇడ్లీ చట్టం” అంటూ ఏదో ఒక చట్టాన్ని తెరపైకి తెచ్చి జైలుకు పంపుతున్నారని ఎద్దేవా చేశారు.
Kodali Nani: టీడీపీది ‘బూడిద పార్టీ’.. మాది సంక్షేమ పార్టీ!
వైసీపీని కొందరు ‘గొడ్డలి పార్టీ’ అని విమర్శించడంపై కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. “మాది గొడ్డలి పార్టీ కాదు, పేదల అభ్యున్నతి కోసం పాటుపడే సంక్షేమ పార్టీ. నిజానికి చంద్రబాబు నాయుడిది ‘బూడిద పార్టీ’. ఇది ఒక ‘బూడిద ప్రభుత్వం’ అని ప్రజలే అనుకుంటున్నారు. తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని పోలీస్ స్టేషన్లలో పెట్టి కాల్చి బూడిద చేసే సంస్కృతి వీరిది. భవిష్యత్తులో వారికి ఆ బూడిదే మిగులుతుంది” అని హెచ్చరించారు.
గతంలోనూ విమర్శలు ఉన్నాయి.. కానీ మేము అణచివేయలేదు!
రావణ్ చేసిన వ్యాఖ్యలు సమాజానికి కొత్తవేమీ కావని, గతంలో ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులుగా ఉన్నవారే అంతకంటే ఘోరమైన భాషను వాడారని నాని గుర్తుచేశారు. గత ఏడాది కాలంగా పవన్ కల్యాణ్‌పై రావణ్ పోస్టులు పెడుతున్నారనే కక్షతోనే జనసేన శ్రేణులు దాడులకు దిగి, కేసులు పెట్టాయని ఆరోపించారు. కోర్టులు బెయిల్ ఇస్తున్నప్పటికీ తట్టుకోలేక, ఇలాంటి దొంగ చట్టాలతో లోపల వేస్తున్నారని విమర్శించారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్‌పై, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రావణ్ విమర్శలు చేశాడని, కానీ తామెప్పుడూ ఇలా అణచివేతకు పాల్పడలేదని స్పష్టం చేశారు.
పచ్చ మీడియా బురదజల్లే ప్రయత్నం చేస్తోంది
రావణ్‌ను వైసీపీ సానుభూతిపరుడిగా చిత్రీకరించేందుకు కూటమి అనుకూల మీడియా ప్రయత్నిస్తోందని కొడాలి నాని మండిపడ్డారు. రావణ్ ఎప్పుడూ చంద్రబాబు, లోకేశ్, బాలకృష్ణలకు అనుకూలంగానే ఉంటాడని, అందుకే టీడీపీ ఈ విషయంలో మౌనంగా ఉందన్నారు. అయితే, కొందరు పచ్చ మీడియా అధిపతులను తిట్టినందుకే, ఇప్పుడు ఆ మీడియా సంస్థలు రావణ్‌పై తప్పుడు కథనాలు అల్లుతూ, ఆ బురదను వైసీపీపై నెట్టేందుకు చూస్తున్నాయని కొడాలి నాని తీవ్రంగా ఆక్షేపించారు.

