Rao Bahadur Movie: కొన్ని సినిమాలు చూసినంత సేపు మాత్రమే ఆనందాన్ని ఇస్తాయి, కానీ మరికొన్ని చిత్రాలు థియేటర్ నుంచి బయటకు వచ్చినా మన ఆలోచనల్లో అలాగే ఉండిపోతాయి.
అలాంటి ఒక అరుదైన సినిమానే 'రావు బహదూర్' అని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కొనియాడారు. దర్శకుడు వెంకటేశ్ మాహా రూపొందించిన ఈ సైకాలజికల్ డ్రామాపై ఆయన ప్రశంసలు కురిపించారు.

మనసును కదిలించే సరికొత్త కథాంశం
తన భార్య నమ్రతా శిరోద్కర్‌తో కలిసి ‘జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్’ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని సమర్పిస్తున్న మహేశ్ బాబు, సోషల్ మీడియా వేదికగా సినిమాపై తన స్పందనను పంచుకున్నారు. “ఈ చిత్రం కేవలం కాలర్ పట్టుకుని కుదిపేసేది మాత్రమే కాదు.. మన అంతరాత్మలోకి, ఆలోచనల్లోకి బలంగా చొచ్చుకెళ్లే సినిమా. వింతగా, అందంగా ఉంటూనే తీవ్రమైన ఎమోషన్స్‌తో సాగే కథ ఇది” అని మహేశ్ పేర్కొన్నారు.
Rao Bahadur Movie: సత్యదేవ్, దీపల నటనపై ప్రశంసలు
దర్శకుడు వెంకటేశ్ మాహా వెండితెరపై సృష్టించిన ప్రపంచం అద్భుతంగా ఉందన్న మహేశ్ బాబు.. హీరో సత్యదేవ్ ఆ పాత్రలో జీవించేశారని కొనియాడారు. హీరోయిన్ దీపా థామస్ సైతం ఎంతో సహజమైన నటన కనబరిచిందని, చిత్ర బృందం మొత్తం ప్రాణం పెట్టి పని చేసిందని అభినందించారు. ఇటీవల మేకర్స్ వదిలిన 'ఇంటూ ది వరల్డ్ ఆఫ్ రావు బహదూర్' అనే బిహైండ్ ద సీన్స్ (BTS) వీడియో సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ వీడియోలో హీరో సత్యదేవ్ గెటప్ చేంజ్ ఓవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రత్యేకమైన మేకప్, కాంటాక్ట్ లెన్సులు, రాజసం ఉట్టిపడే వస్త్రధారణతో ఆయన పూర్తిగా సరికొత్త అవతారంలో కనిపించి అలరించారు.
జులై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల
భారీ సెట్టింగులు, పురాతన కాలం నాటి రాచరిక నేపథ్యం, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సుల కోసం చేసిన సన్నాహాలు సినిమా రేంజ్‌ను చూపిస్తున్నాయి. గత యుగానికి చెందిన ఓ రహస్యాలు, వారసత్వ కథాంశంతో ఈ సైకాలజికల్ డ్రామా ప్రేక్షకులను కట్టిపడేస్తుందని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. వాస్తవానికి జూన్ 5న విడుదల కావాల్సిన ఈ చిత్రం, కొన్ని కారణాల వల్ల వాయిదా పడి ఇప్పుడు జులై 3న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

