Indian Railways: ఇండియన్ రైల్వేస్ రైలు ప్రయాణికుల సౌకర్యార్థం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లలో ప్రయాణించేటప్పుడు పరిమితికి మించి అదనపు లగేజీని తీసుకెళ్లే ప్రయాణికుల కోసం సరికొత్త ఆన్‌లైన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.
ఇకపై కన్ఫర్మ్ రిజర్వ్‌డ్ టికెట్ కలిగిన ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే ఐఆర్‌సీటీసీ (IRCTC) ప్లాట్‌ఫామ్ ద్వారా అదనపు లగేజీ వివరాలను నమోదు చేసి బుక్ చేసుకోవచ్చు. గతంలో అదనపు సామాను ఉన్నవారు రైల్వే స్టేషన్‌లోని పార్శిల్ ఆఫీస్ వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. కానీ, సీఆర్‌ఐఎస్ (CRIS) అభివృద్ధితో అమల్లోకి వచ్చిన ఈ నూతన విధానం వల్ల స్టేషన్‌లో ప్రయాణికుల విలువైన సమయం ఆదా అవ్వడమే కాకుండా, బుకింగ్ ప్రక్రియ ఎంతో సులభతరం కానుంది.
తరగతుల వారీగా లగేజీ పరిమితులు.. చార్జీలు మరియు నిబంధనలు
రైల్వే శాఖ ప్రయాణించే క్లాస్‌ని బట్టి ఉచిత లగేజీ పరిమితి మరియు గరిష్ఠ పరిమితులను స్పష్టంగా వర్గీకరించింది. ఏసీ ఫస్ట్ క్లాస్‌లో 70 కిలోలు, ఏసీ 2-టైర్ మరియు ఫస్ట్ క్లాస్‌లో 50 కిలోలు, స్లీపర్‌లో 40 కిలోలు, సెకండ్ క్లాస్‌లో 35 కిలోల వరకు ఉచితంగా తీసుకెళ్లవచ్చు. అయితే ఏసీ 3-టైర్, ఏసీ 3-ఎకానమీ మరియు ఏసీ చైర్ కార్‌లలో ఉచిత మరియు గరిష్ఠ పరిమితి రెండూ 40 కిలోలే కావడంతో వీటిలో అదనపు లగేజీకి అనుమతి ఉండదు. అదనపు లగేజీకి సాధారణ రేటు కంటే 1.5 రెట్లు ఎక్కువ రుసుము (కనీస చార్జీ రూ. 30) వసూలు చేస్తారు. ఆన్‌లైన్ బుకింగ్ పూర్తి చేసిన అనంతరం, లగేజీని స్టేషన్‌లోని పార్శిల్ ఆఫీస్‌లో తూకం వేయించి, ఆర్‌ఆర్ (RR) రసీదు పొంది ప్రయాణించాల్సి ఉంటుంది. ఎస్ఎమ్‌ఎస్ (SMS) అలర్ట్స్ మరియు ఆన్‌లైన్ ట్రాకింగ్ ద్వారా సామాను ఎక్కడ ఉందో తెలుసుకునే వెసులుబాటు కూడా లభిస్తుంది.

