Rythu Bharosa : తెలంగాణ రాష్ట్రంలోని అన్నదాతలకు కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా సాగు చేసుకునే రైతులకు పంట పెట్టుబడి సాయం అందించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన 'రైతు భరోసా' నిధులను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అధికారికంగా విడుదల చేశారు.
హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో అత్యంత వైభవంగా నిర్వహించిన “రైతు ఆశీర్వాద సభ” వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ఈ నిధులను జమ చేశారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఎకరానికి రూ.6,000 చొప్పున ఆర్థిక సహాయం అందుతుంది. వానాకాలం సాగు పనులు ప్రారంభమయ్యే కీలక సమయంలో పెట్టుబడి సాయం నేరుగా ఖాతాల్లో పడటంతో అన్నదాతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
Rythu Bharosa Funds Release June 30, Rythu Sabhaదశల వారీగా రూ.9వేల కోట్లు – తొలి విడతలో 41 లక్షల మందికి లబ్ధి
ఈ విడత నిధుల పంపిణీని ప్రభుత్వం అత్యంత క్రమబద్ధంగా, పారదర్శకంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా మొదటి విడతలో భాగంగా రెండు ఎకరాల వరకు సాగు భూమి కలిగిన చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యతనిచ్చారు. ఈ మొదటి విడత ద్వారా రాష్ట్రంలోని 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,482 కోట్ల నిధులు జమ కానున్నాయి. మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా కోటిన్నర ఎకరాల సాగు భూమి కలిగిన 73.32 లక్షల మంది రైతులకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం కేటాయించిన మొత్తం రూ.9,000 కోట్ల నిధులను రాబోయే రోజుల్లో దశల వారీగా (వివిధ ఎకరాల పరిమితిని బట్టి) పూర్తిస్థాయిలో విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

