Eruvaaka Punnami 2026: ఏరువాక పున్నమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని రైతాంగం మొత్తానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు మరియు రైతుల పురోభివృద్ధికి తమ కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన ఒక ప్రత్యేక ప్రకటనను విడుదల చేస్తూ రైతుల పట్ల తమకున్న గౌరవాన్ని చాటుకున్నారు.
దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతలందరికీ ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలపడం సంతోషంగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు రైతులు భూమిని, తమ జీవనాధారమైన పశుసంపదను భక్తిశ్రద్ధలతో పూజించి, ప్రకృతితో అనుసంధానమయ్యే అత్యంత విశిష్టమైన సాంప్రదాయ పండుగ ఏరువాక అని ఆయన వివరించారు. ఈ ఏడాది పాడిపంటలతో రైతుల ఇళ్లలో సరికొత్త వెలుగులు నిండాలని తాను మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
Read Also : Joint Family System : ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ రావాలి - చంద్రబాబు
Eruvaaka Punnami 2026: ‘అన్నదాత సుఖీభవ’తో రైతులకు అండగా ప్రభుత్వం
రైతుల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. ఇందులో భాగంగానే 'అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్' నిధులను సకాలంలో జమ చేసి రైతులకు ఆర్థికంగా కొండంత అండగా నిలిచామని ఆయన వివరించారు. రాబోయే రోజుల్లో కూడా రైతులకు ఎలాంటి లోటు లేకుండా అన్ని విధాలా ప్రభుత్వ సహకారం అందుతుందని భరోసా ఇచ్చారు.
ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా వ్యవసాయ రంగంలో తలెత్తుతున్న సవాళ్లను రైతులు ధైర్యంగా అధిగమించాలని చంద్రబాబు సూచించారు. భూమిని, మానవ ఆరోగ్యాన్ని విషతుల్యం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అందుకోసం రైతులు ప్రకృతి సాగు (సేంద్రీయ వ్యవసాయం) పద్ధతుల వైపు మొగ్గు చూపి పంటలు పండించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అందించే సూచనలు, సలహాలను పాటిస్తూ, ఆధునిక సాంకేతికతను జోడించి రైతన్నలు సాగులో సిరులు పండించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

