Srikakulam Police Rescue: రెండేళ్ల బాలుడు అదృశ్యం…రాత్రంతా నెత్తురు మరిగే ఉత్కంఠ.. రాత్రికి రాత్రే రావాడ పరిసరాలను జల్లెడ పట్టిన 15 ప్రత్యేక బృందాలు తుప్పల్లో సురక్షితంగా దొరికిన పసివాడు మోహిత్ ఫలించిన శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి ప్లాన్
Read Also :Vizianagaram News: బొబ్బిలిలో ఘనంగా ర్యాలీ, ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు..
రణస్థలం ( శ్రీకాకుళం జిల్లా)
అది నడిరాత్రి.. సమయం 10:30 గంటలు. శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలంలోని రావాడ గ్రామంలో ఒక మూలన తల్లిదండ్రుల గుండెలు పగిలే రోదన! ఆడుకుంటూ వెళ్లిన రెండేళ్ల నాలుగు నెలల పసికందు ‘మోహిత్’ చీకట్లో మాయమయ్యాడు. చుట్టూ దట్టమైన తోటలు, ప్రమాదకరమైన పొదలు, భయంకరమైన నిర్మానుష్య ప్రాంతాలు! ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తల్లిదండ్రులు రోదిస్తున్న క్షణాల్లో… శ్రీకాకుళం జిల్లా పోలీస్ యంత్రాంగం దేవుడిలా కదిలింది!

ఎస్పీ కె వి మహేశ్వర రెడ్డి చదరంగ వ్యూహం
చిన్నారి అదృశ్యం వార్త వినగానే జిల్లా ఎస్పీ కె వి మహేశ్వర రెడ్డి తక్షణమే రంగంలోకి దిగారు. ప్రతి నిమిషం అమూల్యమైనదే.. బాలుడిని క్షేమంగా తీసుకొచ్చే వరకు నిద్రపోయేదే లేదంటూ అధికారులను పరుగులు పెట్టించారు. ఎస్పీ ఆదేశాలతో జెఆర్ పురం సీఐ ఎం అవతారం పర్యవేక్షణలో జె ఆర్ పురం, లావేరు, ఎచ్చెర్ల, జి సిగడాం, పొందూరు ఎస్ఐలు వి సత్యనారాయణ, వి సందీప్ కుమార్, జి లక్ష్మణరావు, అప్పలసూరి, జి రాజేష్, చిరంజీవిలతో పాటు ఏకంగా 15 ప్రత్యేక బృందాలు యుద్ధ ప్రాతిపదికన రావాడ గ్రామానికి చేరుకున్నాయి.
నైట్ డ్రోన్లు - జల్లెడ పట్టిన డాగ్ స్క్వాడ్
రాత్రి వేళ చీకటిని సైతం చీల్చుకుంటూ నైట్ విజన్ డ్రోన్లు తోటలపై గాల్లోకి లేచాయి. మరోవైపు డాగ్ స్క్వాడ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, క్లూస్ టీమ్స్ తోటలు, పొదలు, గుబురు ప్రాంతాలను అంగుళం అంగుళం జల్లెడ పట్టాయి. వీటికి తోడు పాములు, క్రూర జంతువుల భయాన్ని పక్కనపెట్టి రాత్రంతా పోలీసులు నైట్ ఆపరేషన్ కొనసాగించారు.
Srikakulam Police Rescue: ఉదయాన్నే వెల్లివిరిసిన చిరునవ్వులు – కన్నీళ్లతో పోలీస్‌లకు స్థానికుల శాల్యూట్!
రాత్రంతా సాగిన ఉత్కంఠభరిత శోధన ఆపరేషన్ కు శుక్రవారం వేకువజామున సుఖాంతం లభించింది. తోటలోని దట్టమైన తుప్పల నడుమ భయంతో వణుకుతున్న చిన్నారి మోహిత్‌ను పోలీసులు అత్యంత సురక్షితంగా బయటకు తీశారు.
సూర్యోదయంతో పాటు బాలుడిని తెచ్చి తల్లి చేతుల్లో పెట్టిన ఆ క్షణం.. రావాడ గ్రామం మొత్తం “పోలీస్ జిందాబాద్” అంటూ హర్షధ్వానాలతో ప్రతిధ్వనించింది. తమ బిడ్డను ప్రాణాలతో తిరిగి తెచ్చి ఇచ్చిన పోలీసుల కాళ్లకు నమస్కరిస్తూ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.
చిన్నారుల భద్రతపై జిల్లా ఎస్పీ సందేశం
ప్రజల ప్రాణ రక్షణే మా మొదటి ప్రాధాన్యత. రాత్రంతా శ్రమించి పసివాడిని క్షేమంగా రక్షించిన నా పోలీస్ అధికారులకు, సిబ్బందికి అభినందనలు. పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి ఆపద వచ్చినా తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
- నిజమైన కథానాయకులు
కేవలం శాంతిభద్రతలను కాపాడటమే కాదు.. కష్టమొస్తే కంటికి రెప్పలా కాపాడే కర్మవీరులు మేము అని శ్రీకాకుళం జిల్లా పోలీసులు నిరూపించారు. ఖాకీ దుస్తుల వెనుక ఉన్న మానవత్వాన్ని, వృత్తిపట్ల వారి అంకితభావాన్ని చూసి జిల్లా ప్రజలంతా జేజేలు పలుకుతున్నారు.

