Allu Arjun Raaka : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం రాకా గురించి మరో ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, ఇప్పుడు దీనిని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొదట ఈ (Allu Arjun Raaka) ప్రాజెక్ట్‌ను ఒకే సినిమాగా విడుదల చేయాలని భావించినప్పటికీ, ప్రస్తుతం డిజిటల్ రైట్స్, కథా విస్తృతి, కమర్షియల్ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని రెండు భాగాలుగా విడుదల చేసే దిశగా చర్చలు జరుగుతున్నాయని సమాచారం.
సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో :
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. విజువల్ గ్రాండియర్, అత్యాధునిక సాంకేతికత, భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెతో పాటు మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, జాన్వీ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా మరింత ఆసక్తి పెరిగింది.

అల్లు అర్జున్ కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ను వేగంగా పూర్తి చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరి నాటికి రెండు భాగాలకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేయాలని ప్రణాళిక సిద్ధం చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి దశలవారీగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది.
అయితే, సినిమాను నిజంగానే రెండు భాగాలుగా విడుదల చేస్తారా? లేదా ఒకే చిత్రంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారా? అనే విషయంపై చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

