Manholes : వర్షాకాలంలో కురుస్తున్న భారీ వర్షాలు నగర ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ముఖ్యంగా రోడ్లపై నీరు నిలిచిపోవడంతో మ్యాన్‌హోల్స్ (Manholes) కనిపించకుండా పోవడం ప్రాణాపాయ పరిస్థితులకు దారితీస్తోంది.
ఇటీవల హైదరాబాద్‌లో చోటుచేసుకుంటున్న వరుస ఘటనలు నగరవాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వర్షపు నీటిలో తెరిచి ఉన్న లేదా మూతలు సరిగా లేని మ్యాన్‌హోల్స్ ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
వర్షాలు కురుస్తున్న సమయంలో రోడ్లపై నీరు నిల్వ :
మంగళవారం మియాపూర్‌లోని వైశాలి నగర్ సమీపంలోని రైల్వే అండర్‌పాస్ వద్ద విషాదకర ఘటన జరిగింది. భారీ వర్షాల కారణంగా నీటితో నిండిపోయిన ప్రాంతంలో ఉన్న మ్యాన్‌హోల్‌లో బాలయ్య అనే వ్యక్తి ప్రమాదవశాత్తు పడిపోయి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, జీహెచ్‌ఎంసీ, విపత్తు నిర్వహణ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

వర్షాలు కురుస్తున్న సమయంలో రోడ్లపై నీరు నిల్వ ఉంటే వాహనదారులు, పాదచారులు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా తెలియని రూట్లలో ప్రయాణించే వారు వేగాన్ని తగ్గించి జాగ్రత్తగా వెళ్లాలని, నీటితో నిండిన అండర్‌పాస్‌లు లేదా లోతైన ప్రాంతాల్లోకి వెళ్లకుండా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం మంచిదని చెబుతున్నారు.
అలాగే తెరిచి ఉన్న మ్యాన్‌హోల్స్‌ను వెంటనే గుర్తించి మూతలు ఏర్పాటు చేయాలని ప్రజలు కూడా అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రమాదకర ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ చేపడుతున్నప్పటికీ, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాలను ప్రమాదంలో పడేసే అవకాశం ఉన్నందున వర్షాకాలంలో ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

