Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రెండు రోజుల నష్టాల తర్వాత లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

రెండు రోజుల నష్టాల తర్వాత లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

వార్త 4 days ago

Stock Market: గత రెండు రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్లను కుదిపేస్తున్న నష్టాల పరంపరకు మంగళవారం నాటి ట్రేడింగ్‌లో బ్రేక్ పడింది. ఇన్వెస్టర్లు చివరి గంటలో భారీగా కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు ఒక్కసారిగా పుంజుకుని లాభాల బాట పట్టాయి.

మార్కెట్ ముగిసే సమయానికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ (Sensex) 394.50 పాయింట్లు లాభపడి 73,918.76 వద్ద స్థిరపడింది. అటు జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ (Nifty) కూడా 119.10 పాయింట్ల వృద్ధితో 23,242.10 వద్ద ముగిసింది.

Sensex Profit

Read also: Blender's Pride : 'బ్లెండర్స్ ప్రైడ్ రిజర్వ్ డ్ ఎక్స్ పీరియెన్సెస్' మల్టీ-సెన్సరీ ప్లాట్‌ఫామ్ ఆవిష్కరణ!

పీఎస్‌యూ బ్యాంక్ షేర్ల హవా.. ఐటీ రంగానికి నష్టాలు

మంగళవారం నాటి ట్రేడింగ్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ (PSU Bank) షేర్లు ఇన్వెస్టర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ ఏకంగా 3 శాతానికి పైగా లాభాలను మూటగట్టుకుంది. వీటితో పాటు ఆటోమొబైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్, రియల్టీ రంగాల షేర్లలోనూ మంచి కొనుగోళ్ల మద్దతు లభించింది. అయితే, ఐటీ మరియు మీడియా రంగాల సూచీలు మాత్రం నష్టాల నుంచి బయటపడలేకపోయాయి. బ్రాడర్ మార్కెట్ విషయానికి వస్తే.. నిఫ్టీ మిడ్‌క్యాప్ 1.35 శాతం, స్మాల్‌క్యాప్ 1.69 శాతం చొప్పున లాభాలతో ముగిశాయి.

Stock Market: మార్కెట్లను పెంచిన ‘ట్రంప్’ వ్యాఖ్యలు!

అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న సానుకూల మార్పులు మన దేశీయ మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయి. పశ్చిమాసియాలో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మార్కెట్లకు బూస్టింగ్ ఇచ్చాయి. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు పురోగతిలో ఉన్నాయంటూ ట్రంప్ సానుకూల సంకేతాలు ఇవ్వడంతో భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గుతాయనే ఆశలు చిగురించాయి. దీంతో ఇన్వెస్టర్లలో నమ్మకం పెరిగి బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల షేర్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించారు.

నేటి మార్కెట్ లాభాల్లో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో), జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐషర్ మోటార్స్, ఎస్‌బీఐ వంటి షేర్లు టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. మార్కెట్ విశ్లేషకుల అంచనా ప్రకారం.. రాబోయే సెషన్లలో నిఫ్టీ గనుక 23,300 మార్కును దాటితే, అది 23,450 నుండి 23,550 స్థాయిల వరకు దూసుకెళ్లే అవకాశం ఉంది. అయితే, దిగువన 23,100 స్థాయి వద్ద నిఫ్టీకి తక్షణ మద్దతు (Support Level) ఉందని, ఒకవేళ మార్కెట్ ఈ స్థాయి కంటే కిందకు పడిపోతే మళ్లీ అమ్మకాల ఒత్తిడి పెరగొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha