AP Weather Updates: ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ప్రస్తుతం అత్యంత భిన్నంగా మారుతోంది. ఒకవైపు భానుడి భగభగలతో జనం అల్లాడుతుంటే, మరోవైపు అకస్మాత్తుగా కురిసే పిడుగులతో కూడిన వర్షాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి.
రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తాజా నివేదిక ప్రకారం, రాష్ట్రంలో ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరుకుంది.
Read Also: AP Rains: ఏపీలో పలుచోట్ల దంచికొడుతున్న భారీ వర్షాలు
గూడూరులో రికార్డు స్థాయి ఉష్ణోగ్రత
రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ఎండలు తీవ్రస్థాయిలో మండిపోయాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని గూడూరులో అత్యధికంగా 46.2°C ఉష్ణోగ్రత నమోదై ఈ సీజన్లోనే రికార్డు సృష్టించింది. ప్రకాశం జిల్లాలోని కొప్పెరపాడులో 46.1°C, కంబంలో 45.7°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాదాపు 286 మండలాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు దాటడంతో జనం ఇంటి నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. వేడి గాలుల ప్రభావంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.
27 మండలాల్లో వడగాల్పుల హెచ్చరిక
సోమవారం వాతావరణం మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లోని 27 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు వడదెబ్బకు గురికాకుండా ఉండటానికి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.
AP Weather Updates: కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
ఒకవైపు ఎండలు మండుతుంటే, మరోవైపు ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. కాకినాడ, అనకాపల్లి, కోనసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది. పిడుగులు పడే సమయంలో ప్రజలు చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల వద్ద గానీ ఉండవద్దని హెచ్చరించారు. ఈ అకాల వర్షాలు మరియు వడగాల్పుల ప్రభావంతో అటు సామాన్య జనం, ఇటు పంట కోత దశలో ఉన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
మండిపోతున్న ఎండల మధ్య ఐఎండీ కూల్ అప్‌డేట్.. ఆ తేదీ నుంచి వర్షాలు షురూ!

