CM Chandrababu : తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా CM (Chandrababu) చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 15న తిరుమలకు వెళ్లనున్నారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వర స్వామివారికి సీఎం పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాల ప్రారంభ రోజున సీఎం స్వయంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
సీఎం చంద్రబాబు తిరుమల పర్యటన :
సీఎం చంద్రబాబు తిరుమల పర్యటన నేపథ్యంలో టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆలయానికి చేరుకున్న అనంతరం సంప్రదాయబద్ధంగా శ్రీవారిని దర్శించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించే కార్యక్రమం జరగనుంది. అనంతరం ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాల ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించే వార్షిక ఉత్సవాల్లో ముఖ్యమైనవి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో మలయప్పస్వామి ఉభయదేవేరులతో కలిసి ఉదయం, సాయంత్రం వివిధ వాహనాలపై మాడవీధుల్లో ఊరేగుతారు. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఉత్సవాలకు తరలివస్తారు.
ముఖ్యమంత్రి పర్యటనతో పాటు బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో భద్రతా చర్యలు చేపడుతోంది. వీఐపీ దర్శనాలు, ట్రాఫిక్, వాహనాల రాకపోకలు, భక్తుల క్యూలైన్లు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇదిలా ఉండగా, బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో టీటీడీ అధికారులు ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. స్వామివారి దర్శనం, వాహన సేవలను భక్తులు సౌకర్యవంతంగా వీక్షించేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు పర్యటన, రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణతో రేపటి బ్రహ్మోత్సవాలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకునే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

