KTR: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో అత్యంత కీలకమైన రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) ఆరోపించారు.
ఎన్నికలకు ముందు రియల్ రంగాన్ని పరుగులు పెట్టిస్తామని నమ్మబలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పదవిలోకి వచ్చాక ఆ రంగాన్ని కోలుకోలేని దెబ్బతీశారని మండిపడ్డారు. చేవెళ్ల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశం, ఎస్‌ఐఆర్ (SIR) శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఎన్నికల ముందు రూ. కోటి పలికిన ఎకరం భూమి ధర, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో కనీసం రూ. 50 నుండి 60 లక్షలకు కూడా కొనే నాథుడు కరువయ్యాడని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రంగంపైనే ఆధారపడి బతుకుతున్న లక్షలాది మంది కార్మికులు, నిపుణులు నేడు ఉపాధి కోల్పోయే దుస్థితికి వచ్చారని విమర్శించారు.
కేసీఆర్ హయాంలో చేవెళ్ల ప్రగతి.. నేడు రివర్స్ గేర్: కేటీఆర్
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేవెళ్ల ప్రాంతాభివృద్ధికి పెద్దపీట వేశామని కేటీఆర్ గుర్తుచేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు షాబాద్ పరిసరాల్లో పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేసి మైక్రోసాఫ్ట్, అమెజాన్, వెల్స్‌పన్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలను రాష్ట్రానికి రప్పించామన్నారు. పారిశ్రామికీకరణ పెరగడం వల్లే నాడు రూ. 30 లక్షలు ఉన్న ఎకరం భూమి విలువ ఏకంగా రూ. 3 కోట్లకు చేరిందని, అయితే ప్రస్తుత పాలకుల చేతకానితనం వల్ల ఆ పరిస్థితి తలకిందులైందని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టి రెండున్నరేళ్లు గడుస్తున్నా.. ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒక్కదాన్ని కూడా పూర్తిగా నెరవేర్చలేకపోయిందని కేటీఆర్ దుయ్యబట్టారు. రైతు బంధు, దళిత బంధు, ఇందిరమ్మ ఇళ్లు, అసైన్డ్ భూముల పట్టాల పంపిణీ వంటి ప్రతి విషయంలోనూ ప్రజలను ఘోరంగా వంచించారని, ఫలితంగా అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.
KTR: 2028లో మళ్లీ కేసీఆర్ సీఎం కావాలి.. అప్పులపై కేటీఆర్ సవాల్
రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు మునుపెన్నడూ లేని స్థాయిలో పెరిగిపోయాయని కేటీఆర్ ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులపై నిత్యం విమర్శలు చేసే కాంగ్రెస్ నాయకులు, తాము అధికారంలోకి వచ్చాక చేసిన వేల కోట్ల అప్పుల లెక్కలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన ప్రతి పైసా అప్పును రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ ప్రాజెక్టుల కోసమే వెచ్చించామని స్పష్టం చేశారు.
తెలంగాణను మళ్లీ ప్రగతి పథంలో నడపాలంటే 2028 ఎన్నికల్లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమని కేటీఆర్ పునరుద్ఘాటించారు. ఈ క్రమంలోనే పార్టీ సభ్యత్వ నమోదును, ఎస్‌ఐఆర్ శిక్షణ కార్యక్రమాలను కార్యకర్తలంతా కలిసికట్టుగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Epaper: epaper.vaartha.com
తెలంగాణకు గుడ్‌న్యూస్: రహదారుల ప్రాజెక్టులపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక సమీక్ష

