AP -Tamil Nadu Railway Line : ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య రవాణా సదుపాయాలను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ దేశవ్యాప్తంగా పలు మల్టీ-ట్రాకింగ్ రైల్వే (AP -Tamil Nadu Railway Line) ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ఏపీ – తమిళనాడును కలిపే గుమ్మడిపూడి – గూడూరు సెక్షన్‌లో మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణానికి రూ.2,229 కోట్లను కేటాయించినట్లు కేంద్ర మంత్రులు వెల్లడించారు.
రద్దీ నివారణే లక్ష్యంగా మాస్టర్‌ప్లాన్ :
చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ 90 కిలోమీటర్ల మేర సాగే డబుల్ లైన్ విస్తరణ ప్రాజెక్టును రాబోయే నాలుగేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రద్దీగా ఉండే హౌరా-చెన్నై ప్రధాన మార్గంలో రాకపోకలను సులభతరం చేయడానికి ఈ ప్రాజెక్ట్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఈ అదనపు లైన్ల ద్వారా ఏటా సుమారు 2.12 కోట్ల టన్నుల కార్గో రవాణా అదనంగా జరుగుతుందని అంచనా. దీనివల్ల సిమెంట్, ఇనుము, ఉక్కు, ఆహార ధాన్యాలు, వివిధ రకాల కంటైనర్ల రవాణా మరింత వేగవంతం కానుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా తిరుపతి మరియు తిరువళ్లూరు జిల్లాలను కలుపుతూ విస్తరణ పనులు జరగనున్నాయి.
ఇందులో భాగంగా స్వర్ణముఖి నదిపై 360 మీటర్ల పొడవుతో ఒక మెగా వంతెనతో పాటు 21 ప్రధాన వంతెనలు, 127 చిన్న వంతెనలు, 34 రోడ్డు ఓవర్/అండర్ బ్రిడ్జీలను నిర్మించనున్నారు. దీనివల్ల ప్రయాణికుల ట్రైన్లు మరింత సమయపాలన పాటిస్తాయని, గూడ్స్ బండ్లు త్వరగా గమ్యస్థానాలకు చేరతాయని అధికారులు తెలిపారు.

