Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రూ.30 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా

రూ.30 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా

వార్త 1 week ago

Puppalaguda land: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన, పర్యావరణ పరిరక్షణ సంస్థ (HYDRA) ఒక భారీ ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టింది.

దశాబ్దాలుగా వివాదాల్లో నలుగుతూ, కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కుకునే ప్రమాదంలో ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని రక్షించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ-ఖాజాగూడ సరిహద్దుల్లో ఉన్న 198 ఎకరాల ప్రభుత్వ భూమిని శుక్రవారం హైడ్రా తన ఆధీనంలోకి తీసుకుంది. సుమారు రూ.30,000 కోట్ల విలువ చేసే ఈ భూమిలో 250 కోట్ల సంవత్సరాల నాటి అరుదైన చారిత్రక రాతి గుట్టలు కూడా ఉండటం విశేషం. ఈ మెగా ఆపరేషన్‌తో అమూల్యమైన ప్రకృతి, చారిత్రక సంపదకు హైడ్రా పటిష్టమైన రక్షణ కవచం ఏర్పాటు చేసింది.

Read Also : Siddipet News:పద్మశాలీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది.. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్ హామీ!

 Hydra saved government land worth Rs. 30 thousand crores

Puppalaguda land: దశాబ్దాల న్యాయపోరాటం.. ప్రజావాణి ఫిర్యాదు

గతంలో రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌ఎండీఏ (HMDA)కు కేటాయించిన ఈ భూమిలో అద్భుతమైన రాతి శిలలు, గుహలు, పచ్చని చెట్లు ఉన్నాయి. ఈ చారిత్రక సంపదను కాపాడాలంటూ ‘సొసైటీ టు సేవ్ రాక్స్’ ప్రతినిధులు దశాబ్దాలుగా న్యాయపోరాటం చేస్తున్నారు. వారి పిటిషన్‌పై గతంలో విచారణ జరిపిన హైకోర్టు, 2019లోనే ఈ రాతి గుట్టలతో పాటు ప్రభుత్వ భూమిని సంరక్షించాలని మున్సిపల్, రెవెన్యూ శాఖలను ఆదేశించింది. అయితే, హద్దులు గుర్తించి ఫెన్సింగ్ వేయడంలో జాప్యం జరగడంతో ఈ భూమి కబ్జాకు గురయ్యే ప్రమాదం ఏర్పడింది. దీంతో ‘సొసైటీ టు సేవ్ రాక్స్’ ప్రతినిధులు ఇటీవల హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

రంగంలోకి కమిషనర్ ఏవీ రంగనాథ్.. పక్కాగా సర్వే

ఈ ఫిర్యాదుపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వెంటనే స్పందించి, క్షేత్రస్థాయిలో పర్యటించారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి సంయుక్తంగా సర్వే నిర్వహించి, ఆ భూమిని ప్రభుత్వ ఆస్తిగా నిర్ధారించుకున్నారు. అనంతరం శుక్రవారం ఆ భూమి చుట్టూ పటిష్టమైన ఫెన్సింగ్ ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని చేపట్టారు.

భూమి వివరాల రికార్డు:

  • రెవెన్యూ రికార్డుల ప్రకారం.. సర్వే నంబర్ 452/1లో 174 ఎకరాలు, 454/1లో 119.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది.
  • ఇందులో ఓవర్‌ల్యాప్ సమస్యల కారణంగా 63.05 ఎకరాలు ప్రైవేటు వ్యక్తులకు చెందినదిగా గుర్తించారు.
  • మిగిలిన భూమిలో దేవాలయాలకు 5 ఎకరాలు, దర్గాకు 5 ఎకరాలు కేటాయించగా, నికరంగా సుమారు 200 (198) ఎకరాల హెచ్‌ఎండీఏ భూమిని హైడ్రా కబ్జాదారుల నుంచి కాపాడింది.

పర్యాటక కేంద్రంగా ఖాజాగూడ గుట్టలు

హైడ్రా చేపట్టిన ఈ భారీ ఆపరేషన్‌పై ‘సొసైటీ టు సేవ్ రాక్స్’ ప్రతినిధులు, పర్యావరణ ప్రేమికులు తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. సహజ సిద్ధమైన వ్యూ పాయింట్లు, చారిత్రక గుట్టలను కాపాడి, అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసినందుకు హైడ్రా అధికారులను అభినందించారు.

ఇదే సమయంలో, ఈ గుట్టలను ఆనుకుని ఉన్న భగీరథమ్మ చెరువును కూడా హైడ్రా పునరుద్ధరిస్తోంది. ఒకవైపు ఎత్తైన కొండలు, మరోవైపు జలకళతో నిండిన చెరువుతో ఈ ప్రాంతం భవిష్యత్తులో ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతుందని స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

సిద్దిపేటలో అద్వితీయ ఎంటర్‌ప్రైజెస్ ప్రారంభించిన హరీశ్ రావు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha