Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సాక్ష్యాల కోసం సమాధులే తవ్వాలా?

సాక్ష్యాల కోసం సమాధులే తవ్వాలా?

వార్త 2 weeks ago

Evidence : పాలకులు చేసే చట్టాలు, సంస్క రణలు, నిబంధనలు ఏవైనా ప్రజలకు ప్రయోజనాలు కలిగించేలా ఉండాలి తప్ప ఇబ్బందులు కష్టనష్టాల పాలు చేయకూడదు. కొన్ని సందర్భా ల్లో ఈ నిబంధనల వల్ల ఎన్నో ఇక్కట్లకు గురవుతున్నారు.

ఇటీవల ఒడిషా కియోంయోర్ జిల్లాలోని గ్రామీణ బ్యాంకుశాఖలో జరిగిన సంఘట న దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కల్రా ముండా అనే గిరిజన మహిళ 2026 సం॥జనవరిలో మరణించింది. అంతకు ముందు సుమారు రూ.19వేల మొత్తాన్ని తన బ్యాంకుఖాతాలో జమచేసింది. ఆమెకు ఇతర వారసులెవరూ లేకపోవడంతో, ఆమె సోదరుడు జీతూముండా ఆ సొమ్ము తీసుకోవడానికి బ్యాంకు వారిని సంప్రదించాడు. వారు, ఖాతాదారు స్వయం గా రావాలనే షరతు పెట్టారు. ఒకవేళ ఆమె మరణించిన ట్లైతే ధృవీకరణ పత్రాలు, వారసత్వ ఋజువు సమర్పించా లని సూచించారు.

Read Also : Sangareddy News: తల్లిదండ్రుల మరణాన్ని తట్టుకోలేక కుమారుడి ఆత్మహత్య

 Evidence

Evidence : అస్థిపంజరాన్ని మళ్లీ సమాధి చేయడం

బ్యాంకు, సంబంధిత రెవెన్యూ కార్యాల యాల చుట్టూ అనేకసార్లు తిరిగినా, కావలసిన పత్రాలు తీసుకురావడం నిరక్షరాస్యుడైన జీతూకు సాధ్యం కాలేదు. ఎటూ తోచలేదు. జీతూ తనసోదరి సమాధిని తవ్వి, అస్థి పంజరాన్ని బయటకు తీసాడు. దానిని ఒక గోనె సంచిలో చుట్టి భుజాన వేసుకుని, సుమారు 3 కిలోమీటర్ల దూరం నడిచి బ్యాంకుకు చేరుకున్నాడు. అక్కడ తన అక్క మరణా నికి ఇంతకంటే సాక్ష్యం తన వద్ద లేదంటూ, డబ్బు విడుదల చేయాలని బ్యాంకు వారిని ప్రాధేయపడ్డాడు. ఈ అనూహ్య మైన సంఘటన తరువాత పోలీసులు, జిల్లా పరిపాలన యంత్రాంగం, బ్యాంకు అధికారులు జోక్యం చేసుకోవడంతో అస్థిపంజరాన్ని మళ్లీ సమాధి చేయడం, కావలసిన పత్రాలు జారీ చేయడం, ఖాతాలో ఉన్న మొత్తాన్ని విడుదల చేయ డం, జిల్లా పరిపాలన యంత్రాంగం నుండి అదనంగా ఆర్థిక సహాయం అందించడం వంటి పనులన్నీ చకచకా జరిగిపోయాయి. సభ్యసమాజం తలదించుకునేలా చేసిన విషాద పర్వం కేవలం జీతూతోనే ప్రారంభం కాలేదు, అంతం అవ్వ దు కూడా!

తిలా పాపం తలా పిడికెడు

దేశవ్యాప్తంగా వెలుగులోకిరాని ఇటువంటి ఉదంతాలు ఎన్నో. ఒక్కొక్క దయనీయ గాథ ఒక్కో రకంగా ఉంటుంది. ప్రతి ఉదంతమూ భవిష్యత్ సంఘటనలకు పరి ష్కారం చూపాల్సి ఉంటుంది. లేకుంటే అనాగరిక సమాజం లో అమాయకులకు న్యాయం దక్కదు. ఈ ఘటనతో ఒక ప్రధానమైన ప్రశ్న తలెత్తుతోంది దీనికి బాధ్యులు ఎవరు? ఈ ఉదంతాన్ని క్షుణ్ణంగా విశ్లేషిస్తే ఏ ఒక్క వ్యవస్థను, అధి కారిని దోషిగా నిలబెట్టడం సరైంది కాదు. తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు, ఎన్నో సంస్థాగత, వ్యక్తిగత, సమన్వయ లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. వాటి పరిష్కారానికి ఔచిత్య ముగింపు వెదుక్కోవాల్సి ఉంటుంది. ప్రజల డిపాజిట్లతో వ్యాపారం చేస్తున్న బ్యాంకులు, ఆ సొమ్ము భద్రత కుతగిన చర్యలు తీసుకోవడాన్ని ఎవరూ ఆక్షేపించరు. నిబం ధనల ప్రకారం బ్యాంకు సిబ్బంది కొన్ని పత్రాలు తీసుకురా వాలని కోరడం సమంజసమే. అయితే, పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రం ఉండకూడదు. రూ. 5వేల చిన్న మొత్తాన్ని, రూ.50 లక్షల భారీ మొత్తానికి సంబంధించిన వ్యవహారా న్నీ ఒకే దృష్టితో చూడటమే సబబుగా లేదు. సమంజసం కాదు.

వారసత్వాన్ని నిర్ధారించుకోవడం

ఆర్థికంగా, సామాజికంగా బలహీన వర్గాలకు చెందిన వారి విషయంలో, స్వల్పమొత్తాల విషయంలో కొన్ని వెసులుబాట్లు, సడలింపులు కల్పించాలి. ఉదాహరణకు బ్యాంకు అధికారులు క్షేత్ర సందర్శన చేసి పంచానామాలతో మరణాన్ని ధృవీకరించుకోవడం, రెవెన్యూ యంత్రాంగంతో సమన్వ యం ఏర్పరచుకుని వారసత్వాన్ని నిర్ధారించుకోవడం వంటి చర్యలు నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి కొండంత ఊరటని స్తాయి. అయితే, ఈ సడలింపులు బ్యాంకు శాఖ పరిధిలో ఉండవు. ఉన్నతస్థాయిలో విధానపరమైన నిర్ణయాలు తీసుకో వాలి. వాటిని కట్టుదిట్టంగా అమలు చేసే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. అలాగని, శాఖసిబ్బంది చేతిలో ఏమీ ఉండదనుకోవడం పొరపాటే. నిరక్షరాస్యులు, నిరుపేదలు, గిరిజనులు వంటి వారితో లావాదేవీలు జరిపేటప్పుడు, నిబం ధనలు పాటిస్తూనే మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. ప్రస్తుత సంఘటనలో వాస్తవంగా ఏం జరిగిందన్న దానిపై భిన్నా భిప్రాయాలుఉన్నాయి. సాధారణంగా ఇటువంటి ఖాతాదారులకు ఓపిగ్గా బ్యాంకు నిబంధనలు వివరించడం, వారికి ధైర్యం చెప్పడం, పరిష్కారాలు సూచించడం, తమ పరిధిలో ఉన్నంతవరకు సహాయం చేయడం, అవసరమైతే జిల్లా పాలనాయంత్రాంగాన్ని నేరుగా సంప్రదించడంవంటివి సిబ్బంది విధుల్లో భాగమే. అలా వ్యవహరిస్తే ఇటువంటి సంఘటనలు చాలా వరకూ అరికట్టవచ్చు.

ఖాతాలకు నామినేషన్ లేకపోవడం

అయితే సమ యాభావం, పని ఒత్తిడి, సిబ్బంది కొరత, టార్గెట్లు వంటి ఎన్నో ఇబ్బందుల్ని సహిస్తూ గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో విధులు నిర్వహించే బ్యాంకు సిబ్బంది పరిస్థితి కూడా గమ నించాలి. అటువంటి సమస్యలను బ్యాంకుల యాజమాన్యాలు, ఉన్నతాధికారులు చిత్తశుద్ధితో పరిష్కరించాలి. అయితే, కొన్నిసందర్భాల్లో సంఖ్యాపరమైన లక్ష్యాలు సాధించే అత్యుత్సాహం మాటున మానవీయకోణం మరుగునపడి పోతుంది. పార్లమెంట్లో ఆర్థిక మంత్రిత్వశాఖ అందజేసిన సమాచారం ప్రకారం, జనవరి 2026 నాటికి ‘మదుపుదా రుల విద్య, అవగాహన నిధి’లో రూ. 72వేల కోట్లకు పైగా పేరుకుపోయి ఉంది. బ్యాంకు డిపాజిట్లలో పదిసంవత్సరాలకు పైగా ఖాతా దారులకు గాని, వారి వారసులకు గాని చెల్లించబడకుండా ఉన్న మొత్తాన్ని ఈనిధిలో జమచేస్తారు. ఈ మొత్తాన్నిసరైన పత్రాలు జమచేసి -ఎప్పుడైనా తిరిగి పొందవచ్చు. ఈ నిధిని ఖాతాదారుల్లో ఆర్థిక అక్షరాస్యత, బ్యాంకు లావాదేవీల పట్ల అవగాహన పెంపు వంటి కార్యక్రమాలకు వినియోగిస్తారు. ఇంత పెద్దమొత్తం ఇలా పోగుపడిఉండటం -వ్యవస్థలోనిలోటు పాట్లను స్పష్టంచేస్తుంది. ఎంత మంది జీతూముండాలకు చెందవలసిన సొమ్ము ఇలా నిస్తేజంగా, నిష్క్రియాపరంగా పడివుంది? ఎంతమంది తమ సన్నిహితుల ఖాతాల్లో ఉన్న చిన్నచిన్న మొత్తాలను తిరిగి పొందడంలో ఎన్నెన్ని ఇబ్బం దులు పడుతున్నారు? ఈదుస్థితి ఏర్పడటానికి గల ప్రధాన కారణాలలో, ఖాతాలకు నామినేషన్ లేకపోవడం ఒకటి. ఖాతాలో నామినేషన్ ఉంటే, నామినీ మరణించిన వారి ఖాతాలో ఉండే మొత్తాన్ని సులభంగా పొందవచ్చు. కేవలం మరణధృవీకరణ, కేవైసి పత్రాలుపొందు పరిస్తే సరిపోతుంది.

 Evidence

ఆధార్ ఒక ప్రామాణిక గుర్తింపు

నామినేషన్ లేకపోతే మాత్రం ఈ ప్రక్రియ కొద్దిగా శ్రమతో కూడుకున్నది సాధారణంగా, మరణ ధృవీకరణ, కేవైసీ పత్రాలతో పాటు వారసత్వగుర్తింపు, ఒకరి కంటే ఎక్కువ వారసులు ఉండి ఒక్కరే దరఖాస్తు చేసుకుంటే మిగిలినవారి నుండి త్యాగపత్రం, -పూచీకత్తు వంటివి కూడా అవసరమవు తాయి. ఖాతాలో ఉన్నమొత్తం, ఆస్తి స్వభావం తనఖాలో ఉన్ననగలు, లాకర్లలో ఉన్న చరాస్తులు వంటి వాటిని బట్టి ఈప్రక్రియలో స్వల్పమార్పులు ఉంటాయి. -మరణించింది ప్రవాస భారతీయుడైతే మరికొన్ని పత్రాలు అవసరమవు తాయి. సంబంధిత బ్యాంకు వారిని సంప్రదించిపూర్తి వివ రాలు తెలుసుకోవాలి. ఈప్రక్రియలో ఆలస్యం, ఇబ్బందులు ఏర్పడితే బ్యాంకు ఉన్నతాధికారులను సంప్రదించాలి. ఇంకా పరిష్కారం కాకపోతే, బ్యాంకింగ్ అంబుడ్స్ మాన్ను కూడా సంప్రదించవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా, ఖాతాదారు మరణించిన వెంటనే ఆ విషయాన్ని బ్యాంకు వారికి లిఖిత పూర్వకంగా తెలియపరిస్తే, బ్యాంకు వారు ఖాతాను స్తంభిం పజేస్తారు. తద్వారా అందులో ఉన్న మొత్తానికి పటిష్ఠమైన భద్రత ఏర్పడుతుంది. వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం దేశమంతా ఆధార్ ఒక ప్రామాణిక గుర్తింపు పత్రంగా మారింది. బ్యాంకు ఖాతాలు, మరణ నమోదు వంటి అంశాలు రెండూ ఆధార్ తోఅనుసంధానించబడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తిమరణం రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాగానే, ఆసమా చారం ఆ వ్యక్తి బ్యాంకు ఖాతాలకు చేరే స్వయంచాలకంగా వ్యవస్థను అభివృద్ధి చేయలేమా అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. ఈ సమస్యలు, ప్రశ్నలు వినటానికి జటిలం గానే అనిపిస్తాయి. కానీ, వ్యక్తులు, వ్యవస్థలు చిత్తశుద్ధితో, మానవతా దృక్పథంతో, ఒకరినొకరు సమన్వయం చేసు కుంటూ ముందుకుసాగితే పరిష్కారం అసాధ్యంకాదు. మరొక జీతూముండా ఉదంతం పునరావృతంకాదని ఆశిద్దాం.

-కృష్ణబాలాజి పల్లపోతు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

లైన్‌మెన్‌ను ముంచిన సైబర్ ముఠా.. ఏకంగా రూ. 94 లక్షలు కొల్లగొట్టిన కేటుగాళ్లు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha