Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం!

సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం!

వార్త 1 week ago

Sai Krishna Missing Case: నేరస్థులకు, క్రిమినల్స్‌కు కులం రంగు పులిమి రాజకీయ ప్రయోజనం పొందాలని చూసే దిగజారుడు సంస్కృతిపై జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన 'జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ' సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేవలం ఒకే కులానికి చెందినవాడనే కారణంతో ఒక ప్రొఫెషనల్ క్రిమినల్‌కు కొందరు మద్దతు పలకడం సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తుందని ఆయన నిలదీశారు.

Read also:Sai Krishna Custodial Death: సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. మరో ముగ్గురిపై సిట్ దృష్టి

'సాయికృష్ణ మిస్సింగ్ కేసు'.. కుట్ర రాజకీయాలపై ఫైర్

ఇటీవల సంచలనం రేపిన సాయికృష్ణ మిస్సింగ్ కేసును పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. “14 ఏళ్ల మైనర్ బాలికను మూడు రోజుల పాటు ఒక గదిలో బంధించి ఘోరంగా హింసించిన ఓ కుర్రాడి అదృశ్యంపై కేసు నడుస్తోంది. నిందితుడి తల్లి పడే బాధను నేను అర్థం చేసుకోగలను, అది వేరు. కానీ, ఒక ప్రొఫెషనల్ క్రిమినల్‌లా ప్రవర్తించిన వ్యక్తికి కేవలం తమ కులపోడనే కారణంతో కొందరు ఎలా మద్దతిస్తారు? మీ నాయకుడు ఎవరో చెబితే, మీరేంటో నేను చెబుతాను” అని పవన్ హెచ్చరించారు. వైఎస్సార్సీపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం కులాలను వాడుకుంటోందని, తనను విమర్శించడానికి కాపు సామాజికవర్గ నేతలనే వాడుకుంటోందని ఆరోపించారు. “నన్ను తిట్టేవాళ్లలో ఎక్కువమంది కాపులే. వాళ్ల భుజాలపై తుపాకీ పెట్టి నన్ను కాలుస్తున్నారు. లింగమనేని రమేశ్ గారికి రాజ్యసభ ఇస్తే వాళ్లే విమర్శిస్తారు. ఈ కుట్రపూరిత వ్యవస్థను నేను బ్రేక్ చేస్తాను కాబట్టే నాపై కొందరికి అంత కోపం” అని స్పష్టం చేశారు. తాను ఎప్పుడూ కులం కార్డు వాడి రాజకీయం చేయలేదని.. కులం అనే సామాజిక వాస్తవాన్ని గౌరవిస్తాను కానీ అది ఇంటి గడప దాటకూడదని, గడప దాటితే మానవత్వం, దేశం మాత్రమే గుర్తుండాలని ఉద్ఘాటించారు.

ఐక్యంగా ఉంటే బీసీలు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు

రాష్ట్రంలో దాదాపు 50 శాతం జనాభా ఉన్న బీసీ సామాజిక వర్గాల సాధికారతపై డిప్యూటీ సీఎం కీలక దిశానిర్దేశం చేశారు. “బీసీలు ఎవరినో పదవులు అడగాల్సిన అవసరం లేదు. మీలో మీకు ఐక్యత లేదు కాబట్టే దేహీ అనే పరిస్థితి వస్తోంది. గొడవలప్పుడు ఏకమయ్యే బీసీలు.. ఓట్ల విషయానికి వచ్చేసరికి విడిపోయి సంప్రదాయ పార్టీలకు ఓటేస్తున్నారు. మీరంతా ఐక్యంగా ఉంటే, పది మందికి పదవులు ఇచ్చే స్థితిలో ఉంటారు. బీసీలంతా ఏకమైతే మీకు వైసీపీ లాంటి పార్టీ అవసరం ఉండదు, నాలాంటోడు కూడా అవసరం ఉండడు.” ఈ సందర్భంగా కాన్షీరామ్ నేతృత్వంలోని బీఎస్పీ (BSP) ప్రస్థానాన్ని గుర్తుచేస్తూ, ఏ ఉద్యమమైనా ఒకే సామాజిక వర్గానికి పరిమితమైతే దాని ఎదుగుదలకు పరిమితులు ఏర్పడతాయని విశ్లేషించారు.

సంస్థాగత నిర్మాణం.. సాధక్‌లకే పెద్దపీట

పదేళ్లుగా పార్టీ కోసం గుర్తింపు ఆశించకుండా పనిచేస్తున్న నిజమైన కార్యకర్తలను (సాధక్‌లను) గుర్తించి, భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దడానికే ‘సారథుల సమాచార సేకరణ కమిటీ’ని ఏర్పాటు చేశామని పవన్ తెలిపారు. 700 మంది సభ్యుల ఈ కమిటీలో 600 మంది సాధారణ సాధక్‌లకే అవకాశం కల్పించామని, ఇది నాయకులను ఎంపిక చేసే కమిటీ కాదు, కేవలం పారదర్శకంగా క్షేత్రస్థాయి సమాచారాన్ని సేకరించే కమిటీ మాత్రమేనని స్పష్టం చేశారు.

Sai Krishna Missing Case: బటన్ నొక్కితే సరిపోదు.. రోడ్లు ఎవరు వేస్తారు?

గత వైసీపీ ప్రభుత్వంపై పవన్ విమర్శలు గుప్పించారు. కేవలం బటన్ నొక్కి డబ్బులు వేయడమే పాలన కాదని, మౌలిక సదుపాయాలను పూర్తిగా గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. “డబ్బులు వేశారు సరే, రోడ్లు ఎవరు వేయాలి? ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి ఏంటి? ఎన్ని ఉచితాలు ఇచ్చినా, మౌలిక సదుపాయాలు కల్పించకపోతే ప్రజలు ఇంకోసారి నమ్మరు అనడానికి వైఎస్‌ఆర్‌సీపీ ఓటమే క్లాసిక్ ఉదాహరణ” అని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి, వ్యవస్థల బలోపేతానికి పెద్దపీట వేస్తుందని హామీ ఇచ్చారు.

చివరగా వైసీపీ నేతలకు సవాల్ విసురుతూ.. “మీరు మమ్మల్ని తిట్టడం మానేస్తే, మేము మా పార్టీ నిర్మాణ పనుల్లో ఉంటాం. లేదు, తిడతామంటే.. మిమ్మల్ని తిడుతూనే మేము బలపడతాం. ఏదైనా సరే, మేము బలపడటం గ్యారెంటీ. ఛాయిస్ ఈజ్ యువర్స్” అంటూ ప్రసంగాన్ని ముగించారు.

Read hindi news : hindi.vaartha.com

సాయికృష్ణ అదృశ్యంలో ఉన్నతాధికారుల పాత్ర - విజయలక్ష్మి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha