Sai Krishna Case : విజయవాడ సాయికృష్ణ అదృశ్యం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సాయికృష్ణది ముమ్మాటికీ లాకప్‌డెత్ అని సిట్ ప్రాథమిక విచారణలో తేల్చింది. పోలీస్ కస్టడీలో సాయికృష్ణపై జరిగిన దాడి, తగిలిన తీవ్ర గాయాల వల్లే అతను మరణించాడని రిపోర్టులో స్పష్టం చేసింది. ఈ లాకప్‌డెత్‌ను దాచేందుకు విజయవాడ మాజీ సీఐ నాగరాజు తీవ్రంగా ప్రయత్నించారని, సాయికృష్ణ శవాన్ని పూడ్చిపెట్టడమో లేదా తగులబెట్టడమో చేసి పూర్తిగా మాయం చేసేందుకు యత్నించారని సిట్ పేర్కొంది. సాక్ష్యాలను రూపుమాపేందుకు పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీలను ఉద్దేశపూర్వకంగా డిలీట్ చేశారని సిట్ తన నివేదికలో వెల్లడించింది. అయితే, గత నెల 6 నుండి 8వ తేదీల మధ్య సాయికృష్ణను పోలీస్ స్టేషన్‌లో చూసినట్లు అక్కడి ఎస్ఐ ఇచ్చిన సాక్ష్యం ఈ కేసులో కీలకమయింది. సాయికృష్ణపై పాత కేసులు, నాన్‌బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.
Sai Krishna Case
Sai Krishna Case : సీఐ నాగరాజుకు జులై 8 వరకు రిమాండ్
కోర్టులో హాజరుపరిచేందుకు ముందు సీఐ నాగరాజును కమాండ్ కంట్రోల్ రూం నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా, కోర్టు ఆయనకు రెండు వారాల పాటు (జులై 8 వరకు) రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు నాగరాజును నెల్లూరు జైలుకు తరలించారు. సాయికృష్ణ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ దాఖలైన పిల్ (PIL) పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసు దర్యాప్తు కోసం ఇప్పటికే ఉన్నతాధికారులతో సిట్ ఏర్పాటు చేశామని, దర్యాప్తు సక్రమంగా సాగుతోందని అడ్వకేట్ జనరల్ (AG) కోర్టుకు తెలిపారు. నిందితుడైన సీఐ నాగరాజును ఇప్పటికే అరెస్ట్ చేశామని వివరించారు. సిట్ దర్యాప్తు తీరును పరిశీలిద్దామని వ్యాఖ్యానించిన ధర్మాసనం, తదుపరి విచారణను జులై 6వ తేదీకి వాయిదా వేసింది.

