Sangareddy Arrive Alive Program: మనం ఒక చిన్న మొబైల్ ఫోన్ కొనుగోలు చేస్తేనే ఎంతో జాగ్రత్తగా స్క్రీన్ గార్డ్ వేయిస్తాం. మరి ఆ మొబైల్ కంటే కోట్లాది రూపాయల విలువైన మన ప్రాణాలు, మన ప్రయాణం ఎంతో విలువైనవని గుర్తించాలి.
కావున మన ప్రాణరక్షణలో భాగమైన హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించాలి. గమ్యస్థానానికి చేరుకోవడం ముఖ్యమే, కానీ సురక్షితంగా చేరుకోవడం మరింత ముఖ్యమైనది" అని తెలంగాణ రాష్ట్ర డీజీపీ (లా అండ్ ఆర్డర్) మహేష్ మురళీధర్ భగవత్ స్పష్టం చేశారు.
Read also: Meenakshi natarajan: మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ రద్దుకు దారితీసిన ఆ కేసు ఏమిటి?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా.. సంగారెడ్డి జిల్లా ఫసల్వాడి గ్రామంలో బుధవారం నాడు నిర్వహించిన ప్రత్యేక గ్రామ సభకు డీజీపీ మహేష్ మురళీధర్ భగవత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు రూపొందించిన "ఆరైవ్ అలైవ్" (Arrive Alive) ప్రత్యేక అవగాహన సదస్సును జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్‌లతో కలిసి ఆయన ప్రారంభించారు.
అల్లుళ్లకు కొత్త బట్టలతో పాటు హెల్మెట్ ఇవ్వండి: డీజీపీ
ఈ సందర్భంగా గ్రామ సభలో ప్రజలను ఉద్దేశించి డీజీపీ మహేష్ మురళీధర్ భగవత్ మాట్లాడుతూ.. రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల పని కాదని, అది ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత అని గుర్తు చేశారు. కార్లలో ప్రయాణించేటప్పుడు కేవలం డ్రైవర్ మాత్రమే కాకుండా.. సీట్లలో కూర్చునే ప్రయాణికులందరూ విధిగా సీటు బెల్ట్ ధరించాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనం నడపరాదని, ఒకవేళ మద్యం సేవించినట్లయితే ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాలను లేదా క్యాబ్‌లను వినియోగించుకోవాలని హితవు పలికారు.
తెలంగాణ సంస్కృతిలో పండుగలకు వచ్చే అల్లుళ్లకు కొత్త బట్టలు బహుమతిగా ఇచ్చే అద్భుతమైన సంప్రదాయం ఉందని.. అయితే ఈసారి బట్టలతో పాటు వారి ప్రాణరక్షణకు ఉపయోగపడే ఒక మంచి ఐఎస్‌ఐ (ISI) మార్క్ హెల్మెట్‌ను కూడా గిఫ్ట్‌గా ఇస్తే మరింత బాగుంటుందని డీజీపీ సరికొత్త పిలుపునిచ్చారు. రహదారులపై అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
జుట్టు పాడవుతుందనే నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్ ప్రతీక్ జైన్
జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ.. "ఆరైవ్ అలైవ్" అంటే మన ప్రయాణం సురక్షితంగా సాగి, గమ్యస్థానానికి క్షేమంగా చేరుకోవడమేనని వివరించారు. బైక్ నడిపేటప్పుడు కొందరు యువకులు జుట్టు చెడిపోతుందనో, సీటు బెల్ట్ పెట్టుకుంటే అసౌకర్యంగా ఉంటుందనో భావించి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారన్నారు. ఇంటికి ఆధారమైన కుటుంబ యజమానిని రోడ్డు ప్రమాదంలో కోల్పోతే ఆ కుటుంబానికి జరిగే నష్టం ఏ శక్తీ తీర్చలేనిదని కలెక్టర్ పేర్కొన్నారు.
జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల్లో వేలాది మంది వాహనదారులు, అమాయక పాదచారులు ప్రాణాలు కోల్పోవడానికి ముఖ్య కారణం ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడమేనన్నారు. డీజీపీ స్వయంగా ఫసల్వాడి గ్రామానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం "ఆరైవ్ అలైవ్" ఉద్యమ ప్రాధాన్యతను తెలియజేస్తుందన్నారు.

Sangareddy Arrive Alive Program: ఫసల్వాడిలో 'నో హెల్మెట్ - నో ఎంట్రీ' తీర్మానం..
గ్రామ సభలో ఫసల్వాడి సర్పంచ్ హరిప్రసాద్ మాట్లాడుతూ.. డీజీపీ గారి పిలుపుతో ఈ రోజు నుండి తమ గ్రామంలో హెల్మెట్, సీటు బెల్ట్ ధరించనిదే ఎవరికీ అనుమతి లేదని గ్రామ సభ సాక్షిగా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకుంటున్నట్లు ప్రకటించారు. గ్రామంలో "నో హెల్మెట్ - నో ఎంట్రీ" (No Helmet - No Entry) విధానాన్ని పక్కాగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలపై తమ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంచుకున్నందుకు పోలీస్ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ఉన్నత స్థాయి అవగాహన సదస్సులో సంగారెడ్డి సబ్ కలెక్టర్ ఉమాహారతి, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DM&HO) లలిత, ఆర్డీవో (RDO) రాజేందర్, రవాణా శాఖ జాయింట్ కమిషనర్ వెంకటరమణ, డీఎస్పీ సత్యయ్య గౌడ్, జిల్లా పోలీసు అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, మహిళలు మరియు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

