Telangana Fine Paddy Bonus: తెలంగాణలో వానాకాలం (ఖరీఫ్) సీజన్‌లో సన్నవరి సాగును మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 7 నిర్దిష్ట సన్న రకాల వరికి మాత్రమే క్వింటాలుకు రూ.500 బోనస్‌ను అందించాలని ఆమోదం తెలిపారు.
ఈ బోనస్ సొమ్ము కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కనీస మద్దతు ధర (MSP)కి అదనంగా రైతుల ఖాతాల్లో జమ కానుంది.
Read Also : Nagula Panchami: కౌడిపల్లిలో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి
Bonus for fine-grain paddy… applicable only to them.
Telangana Fine Paddy Bonus: బోనస్ లభించే ఆ 7 సన్న వరి రకాలు ఇవే
తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం రాష్ట్రంలో సాగయ్యే సన్న వరిలో 87 శాతానికి పైగా ఆక్రమించిన 7 ప్రత్యేక రకాలను మాత్రమే బోనస్ కోసం ప్రభుత్వం ఎంపిక చేసింది.
- బీపీటీ-5204 (సాంబ మసూరి)
- ఆర్‌ఎన్‌ఆర్-15048 (తెలంగాణ సోనా)
- హెచ్‌ఎంటీ సోనా
- జైశ్రీరామ్
- కేఎన్‌ఎం-1638 (కునారం సన్నాలు)
- డబ్ల్యూజీఎల్-44 (సిద్ధి)
- కేఎన్‌ఎం-7715
ఈ రకాలకు గింజ పొడవు 6 మి.మీ కంటే తక్కువ, వెడల్పు 2 మి.మీ మించకుండా, పొడవు-వెడల్పు నిష్పత్తి 2.5 కంటే ఎక్కువగా ఉండాలనే నాణ్యతా ప్రమాణాలను ప్రభుత్వం నిర్ణయించింది. సీడ్ కంపెనీలు, డీలర్లు కూడా ఈ రకాల విత్తనాలకే ప్రాధాన్యత ఇవ్వాలని వ్యవసాయ శాఖ సూచించింది.
బోనస్ పొందడానికి నిబంధనలు & నమోదు ప్రక్రియ
సన్న వడ్ల బోనస్ రైతులకు నేరుగా అందేలా పారదర్శకత కోసం ప్రభుత్వం కొన్ని కఠినమైన నిబంధనలను పొందుపరిచింది. నాట్లు వేసిన ఒక నెల రోజులలోపు రైతులు తమ పంట వివరాలను 'ఈ-క్రాప్' (పంట నమోదు పోర్టల్)లో తప్పనిసరిగా నమోదు చేయించాలి. విత్తనాలు డీలర్ నుంచి కొన్నవా లేక సొంత నిల్వలా అనే విషయం స్పష్టంగా తెలియజేయాలి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించే సమయంలో సీడ్ బిల్లును చూపించడం నిబంధనగా విధించారు.
రైతుల ఆందోళన.. ప్రభుత్వ స్పష్టత
ఐదేళ్ల వరకు సొంత ఫౌండేషన్ విత్తనాలను నిల్వ చేసుకుని సాగు చేసే సుమారు 25 శాతం మంది రైతులు ఈ నిర్ణయం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీడ్ బిల్లులు లేకపోవడం వల్ల తమకు బోనస్ దక్కదేమోనని భావిస్తున్నారు. అయితే, మార్కెట్ డిమాండ్, ఎగుమతి సామర్థ్యం, కేంద్ర సేకరణకు అనుకూలమైన నాణ్యమైన రకాలకే ప్రాధ్యాన్యం ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. రైతులు తమ సమీపంలోని రైతు వేదికలు లేదా స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారులను AEO సంప్రదించి పంట నమోదు ప్రక్రియను సకాలంలో పూర్తి చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది.

