EO Srinivasa Rao | శ్రీశైలం, జూన్ 15: శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల క్షేత్రాన్ని సందర్శించే భక్తులు దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాల పట్ల పూర్తిస్థాయిలో సంతృప్తి చెందేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం.
శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. భక్తుల సదుపాయాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.
భక్తులకు తాగునీరు, పారిశుద్ధ్యం, శౌచాలయాలు, వసతి వంటి ప్రాథమిక సౌకర్యాలను మెరుగ్గా అందించడం దేవస్థానం ప్రధాన లక్ష్యమని ఈవో తెలిపారు. ముఖ్యంగా క్యూలైన్లు, క్యూకాంప్లెక్సుల్లో తగినన్ని వాటర్ క్యాన్లు ఏర్పాటు చేసి భక్తులకు నిరంతరంగా తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
క్షేత్ర పరిధిలో నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా పైపులైన్లను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన మరమ్మతులు చేపట్టాలని వాటర్ వర్క్స్ విభాగానికి సూచించారు. అలాగే మురుగునీటి వ్యవస్థను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ పారిశుద్ధ్యాన్ని కాపాడాలని పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు.
భక్తులకు చల్లటి తాగునీరు అందించే చలివేంద్రాల నిర్వహణపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని, గతంలో మాదిరిగానే అన్ని సత్రాల ద్వారా చలివేంద్రాలను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ విభాగానికి సూచించారు. క్షేత్రంలోని దేవస్థానం కాటేజీలు, గదులు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, పరిసరాల్లో చెత్తాచెదారం పేరుకుపోకుండా నిరంతరం పర్యవేక్షించాలని వసతి విభాగ అధికారులను ఆదేశించారు.
EO Srinivasa Rao
భక్తులు వందశాతం సంతృప్తి చెందే విధంగా సేవలు అందించడమే దేవస్థానం లక్ష్యమని పేర్కొన్న ఈవో, ప్రతి విభాగం బాధ్యతాయుతంగా పనిచేసి భక్తులకు మరింత మెరుగైన అనుభవాన్ని అందించాలని సూచించారు. సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి. మురళీబాలకృష్ణ, సహాయ కార్యనిర్వహణాధికారులు బి. మల్లికార్జునరెడ్డి, కె. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read also Epaper: epaper.vaartha.com
read also:

