Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శ్రీశైలంలో వైభవంగా స్వర్ణరథోత్సవం

శ్రీశైలంలో వైభవంగా స్వర్ణరథోత్సవం

వార్త 2 weeks ago

Srisailam Swarna Rathotsavam | శ్రీశైలం, జూన్ 16: అష్టాదశ శక్తి పీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని మంగళవారం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు స్వర్ణరథోత్సవం వైభవంగా నిర్వహించారు.

మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, విశేష పూజలు

ఆరుద్రోత్సవంలో భాగంగా వేకువజామున శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వర్ణరథోత్సవాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించారు.

Read also: Nara Lokesh: సతీసమేతంగా రుద్రాభిషేకంలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్.. రాష్ట్ర ప్రగతి కోసం ప్రత్యేక పూజలు

స్వర్ణరథోత్సవానికి ముందు దేశంలో శాంతి, సౌభాగ్యాలు నెలకొనాలని, అతివృష్టి-అనావృష్టి నివారించబడాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆలయ అర్చకులు సంకల్పం చేశారు. ప్రజలందరికీ ఆయురారోగ్యాలు కలగాలని, అకాల మరణాలు, అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు జరగకుండా ఉండాలని, దేశ ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ప్రార్థించారు.

Srisailam Swarna Rathotsavam: భక్తుల శివనామస్మరణ మధ్య స్వర్ణరథోత్సవం

రథారూఢులైన శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించిన అనంతరం భక్తుల శివనామస్మరణ, వేదమంత్రోచ్చారణల నడుమ ఉదయం 7.30 గంటలకు స్వర్ణరథోత్సవం ప్రారంభమైంది. గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు, తిరిగి అక్కడి నుంచి నందిమండపం వరకు రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఆకట్టుకున్న జానపద కళారూపాలు

సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా రథోత్సవంలో కోలాటం, తప్పెటగుళ్లు, తప్పెట చిందులు తదితర జానపద కళారూపాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు, సహాయ కార్యనిర్వహణాధికారి జి. స్వాములు, అర్చకస్వాములు, వివిధ విభాగాల అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

 Srisailam Swarna Rathotsavam

Read Also hindi news: hindi.vaartha.com

Read also Epaper: epaper.vaartha.com

read also:

శ్రీశైలంలో భక్తుల సౌకర్యాలపై ఈవో సమీక్ష!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha