Srisailam Dam : మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని కృష్ణా పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద నీటి ఇన్ ఫ్లో స్థిరంగా కొనసాగుతోంది.
ప్రస్తుతం ప్రాజెక్టులోకి రోజుకు సగటున 6.50 టీఎంసీల మేర వరద నీరు వచ్చి చేరుతుండటంతో జలాశయంలో నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం డ్యామ్‌లో నీటి నిల్వ 183.41 టీఎంసీలకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి ఇదే స్థాయిలో ప్రవాహాలు కొనసాగితే రాబోయే 5 నుంచి 6 రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. డ్యామ్ నిండే అవకాశం ఉండటంతో రాయలసీమతో పాటు కోస్తాంధ్ర, తెలంగాణలోని ఆయకట్టు రైతుల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.

CWC అధికారుల హెచ్చరికలు - క్రస్ట్ గేట్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి
డ్యామ్‌లో నీటి మట్టం గరిష్ఠ స్థాయికి చేరువవుతున్న తరుణంలో కేంద్ర జల సంఘం (CWC) అధికారులు ప్రాజెక్టు నిర్వహణపై కీలక సూచనలు చేశారు. నీటి నిల్వ పెరిగే కొద్దీ డ్యామ్ భద్రత, గేట్ల నిర్వహణ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకూడదని స్పష్టం చేశారు. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లోలను నిరంతరం పర్యవేక్షిస్తూ క్రస్ట్ గేట్లను సిద్ధంగా ఉంచుకోవాలని ప్రాజెక్టు ఇంజనీర్లను ఆదేశించారు. దిగువన ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసే క్రమంలో ముందస్తు సమాచారం అందిస్తూ, వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సిడబ్ల్యూసీ ఉన్నతాధికారులు సూచించారు.
ఉప్పాడ తీర రక్షణకు కీలక ముందడుగు.. పవన్ సమక్షంలో ఐఐటీ మద్రాస్‌తో ఎంఓయూ

