Kompella Madhavi Latha: తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత, సామాజిక వేత్త కొంపెల్ల మాధవీలత రాజకీయాల్లోనే కాకుండా క్రీడా రంగంలోనూ తన సత్తా చాటారు.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని శాట్స్ (SATS) షూటింగ్ రేంజ్‌లో నిర్వహించిన 12వ తెలంగాణ రాష్ట్ర స్థాయి షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. 25 మీటర్ల పిస్టల్ (మాస్టర్స్ ఉమెన్) విభాగంలో బరిలోకి దిగిన మాధవీలత.. మొత్తం 300 పాయింట్లకు గాను 245 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. ఈ ఘన విజయంతో ఆమె స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నారు. గతంలో హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇప్పుడు పిస్టల్ పట్టి బంగారు పతకం గెలవడంతో మరోసారి వార్తల్లో నిలిచారు.
చిన్ననాటి ఇష్టమే స్ఫూర్తి.. వయసు దేనికీ అడ్డంకి కాదు!
ఈ సందర్భంగా మాధవీలత తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. చిన్న వయసులో ఎన్‌సీసీ (NCC) కేడెట్‌గా ఉన్న సమయంలో, రిపబ్లిక్ డే పరేడ్ శిక్షణ తరగతుల్లో రైఫిల్ పట్టుకున్నానని.. అప్పుడే తనకు ఈ క్రీడపై మక్కువ కలిగిందని తెలిపారు. ప్రజా జీవితంలో ఉన్నవారు సమాజానికి ఆదర్శంగా ఉండాలనే సంకల్పంతోనే తాను మళ్లీ షూటింగ్ రేంజ్‌లోకి అడుగుపెట్టానని చెప్పారు. ఒక లీడర్‌కు సాహసంతో పాటు క్రీడా స్ఫూర్తి కూడా ఎంతో అవసరమని, సాధించాలనే పట్టుదల ఉంటే వయసుతో అస్సలు సంబంధం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. మనసు పెడితే ఏదైనా సాధ్యమేనని నిరూపించిన ఆమె, తన విజయానికి కోచ్ ప్రసన్న ఇచ్చిన శిక్షణ, మార్గదర్శకత్వమే కారణమని కృతజ్ఞతలు తెలిపారు.
Kompella Madhavi Latha: భుజం గాయాన్ని లెక్కచేయకుండా నేషనల్స్ వైపు అడుగులు
ప్రస్తుతం తన కుడి భుజానికి లిగమెంట్ (Ligament) గాయం ఉన్నప్పటికీ, మాధవీలత ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. తన తదుపరి లక్ష్యాల కోసం కఠినమైన ప్రాక్టీస్ కొనసాగిస్తున్నారు. మరో రెండు నెలల్లో ప్రారంభం కానున్న ప్రి-నేషనల్ ఛాంపియన్‌షిప్ పోటీల కోసం ఆమె జిమ్‌లో ముమ్మరంగా శ్రమిస్తున్నారు. దృఢ సంకల్పం ఉంటే ఎలాంటి ఆటంకాలనైనా అధిగమించవచ్చని నిరూపించడమే తన ఆశయమని పేర్కొన్నారు. “ఈ గోల్డ్ మెడల్ నా ఒక్కదానిది కాదు.. నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరిదీ. కలలను నిజం చేసుకోవాలనుకునే మహిళలందరికీ నేను చెప్పేది ఒక్కటే.. మీ హద్దులను ఇతరులను నిర్ణయించనివ్వకండి. మీపై నమ్మకంతో ముందడుగు వేయండి” అని సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చారు.
‘ఉప్రాస్ వ్యాయామ శాల’ సందర్శన.. యువత శక్తే దేశ శక్తి!
షూటింగ్ పోటీలతో పాటు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉండే మాధవీలత.. 1975 నుంచి క్రమశిక్షణకు, దేశభక్తికి మారుపేరుగా నిలిచిన ప్రముఖ ‘ఉప్రాస్ వ్యాయామ శాల’ను సందర్శించారు. అక్కడి సాంప్రదాయ అఖాడా పద్ధతులను కాపాడుతున్న గురువులను, శిక్షకులను మరియు యువ అథ్లెట్లను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ఇటువంటి వ్యాయామశాలలు కేవలం శారీరక దారుఢ్యాన్నే కాకుండా, యువతలో నైతిక విలువలను, దేశభక్తి భావాన్ని పెంపొందిస్తాయని కొనియాడారు. యువత శక్తే దేశానికి నిజమైన బలమని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
read also:

