Telangana Criminal Gang Arrested: సిద్దిపేట జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను బయాందోళనలకు గురిచేస్తున్న ఒక అంతర్ జిల్లా దొంగల ముఠా గుట్టును సిద్దిపేట పోలీసులు విజయవంతంగా రట్టు చేశారు.
కొమురవెల్లి, బెజ్జంకి పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుసగా చోరీలకు పాల్పడిన ముగ్గురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ (CP) రష్మీ పెరుమాళ్ (IPS) మంగళవారం (మే 19, 2026) నాటి మీడియా సమావేశంలో అధికారికంగా వెల్లడించారు.
మహిళలే లక్ష్యంగా ముఠా దారుణాలు
నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట్ మండలం పుల్లగిరి గ్రామానికి చెందిన ముడావత్ కాల్య (37), ముడావత్ పాండు (38), ముడావత్ చందు @ చంద్రు (41) అనే ముగ్గురు నిందితులు ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా రాత్రి సమయాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను, అలాగే వేసవి కాలం కావడంతో ఇండ్ల బయట నిద్రిస్తున్న అమాయక మహిళలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడేవారు. నిద్రిస్తున్న మహిళల మెడల నుండి బంగారు పుస్తెల తాడు, గొలుసులను తెంచుకెళ్లడం వీరి ప్రధాన శైలి. విచారణలో నిందితులు తాము చేసిన అన్ని నేరాలను అంగీకరించారు.
వాహన తనిఖీల్లో దొరికిన దొంగలు
ఈ వరుస దొంగతనాలను సీరియస్‌గా తీసుకున్న సీపీ రష్మీ పెరుమాళ్.. అదనపు డీసీపీ (అడ్మిన్) కుశాల్కర్ పర్యవేక్షణలో సీసీఎస్ మరియు లోకల్ రూరల్ పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు సేకరించిన పక్కా సమాచారం మేరకు కొమురవెల్లి పోలీసులు వేచరేణి గ్రామ పరిధిలోని గుర్జకుంట కమాన్ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా మారూతీ షిఫ్ట్ డిజైర్ కారులో వెళ్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు వ్యూహాత్మకంగా అదుపులోకి తీసుకున్నారు.
Recovered gold ornaments, silver, and a Swift Dzire car displayed by the Siddipet CCS police team after the arrest
భారీగా రికవరీ.. రూ. లక్షల విలువైన సొత్తు స్వాధీనం
బాధితుల ఫిర్యాదుల ప్రకారం మొత్తం 11 తులాల బంగారం, 13 తులాల వెండి నగలు చోరీకి గురవ్వగా.. పోలీసులు నిందితుల నుండి అత్యంత వేగంగా రికవరీ సాధించారు. 9 తులాల బంగారు నగలు, 12 తులాల వెండి నగలు.నేరానికి ఉపయోగించిన ఒక మారుతీ షిఫ్ట్ డిజైర్ కారు, 2 సెల్ ఫోన్లు, ఒక చేతి గడియారం, తాళాలు పగలగొట్టేందుకు వాడిన స్క్రూ డ్రైవర్ మరియు ఇనుప రాడ్.
Telangana Criminal Gang Arrested: రెండు పీఎస్ ల పరిధిలో 6 కేసులు.. పాత నేరాల చరిత్ర!
ఈ ముఠా బెజ్జంకి పీఎస్ పరిధిలోని చిల్లాపూర్, వెంకట్రావు పల్లె, రేగులపల్లి గ్రామాల్లోనూ, అలాగే కొమురవెల్లి పీఎస్ పరిధిలోని కిస్తంపేట గ్రామంలోనూ మొత్తం 6 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. కొత్త చట్టం ప్రకారం వీరిపై BNS 2023 (భారతీయ న్యాయ సంహిత) లోని సెక్షన్ 331(4), 305(a), 304 r/w 62 కింద కేసులు నమోదయ్యాయి.
అంతేకాకుండా, ఈ ముఠాలోని ప్రధాన నిందితుడైన ముడావత్ కాల్యపై గతంలో కీసర, పేట్ బషీరాబాద్, బీబీనగర్, మహేశ్వరం వంటి పోలీస్ స్టేషన్లలో 13 పాత కేసులు, రెండో నిందితుడైన ముడావత్ పాండుపై జడ్చర్ల, పెద్దమందడి, బిజినేపల్లి తదితర స్టేషన్లలో 9 పాత కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను చేర్యాల గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరుస్తున్నట్లు సీపీ తెలిపారు.
పోలీస్ సిబ్బందికి సీపీ అభినందనలు
అత్యంత క్లిష్టమైన ఈ వరుస దొంగతనాల కేసులను చాకచక్యంగా ఛేదించిన హుస్నాబాద్ ఏసీపీ సదానందం, సిద్ధిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, సిఐలు విద్యాసాగర్, రమేష్, సీసీఎస్ ఇన్స్పెక్టర్లు పెండ్యాల దేవేందర్, రవీందర్, ఐటీ కోర్ మరియు ఫింగర్‌ప్రింట్ బృందాలను పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ప్రత్యేకంగా అభినందించి రివార్డులను ప్రకటించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

