Dattatreya : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ (Dattatreya) సోమవారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.
జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన దత్తాత్రేయ.. ఈ ఏడాది నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక 'అలయ్ బలయ్' కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని సీఎంను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని చంద్రబాబు స్వీకరించి కార్యక్రమానికి హాజరవుతానని హామీ ఇచ్చినట్లు తాజా సమాచారం.
రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీల నేతలు :
ప్రతి ఏడాది దసరా సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించే 'అలయ్ బలయ్' కార్యక్రమం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు, సామాజిక ప్రముఖులు ఒకే వేదికపై కలుసుకుని ఆత్మీయంగా పలకరించుకోవడం ఈ కార్యక్రమం ప్రత్యేకత. స్నేహం, సోదరభావం, సామాజిక ఐక్యతను చాటడమే 'అలయ్ బలయ్' ప్రధాన ఉద్దేశమని దత్తాత్రేయ చెబుతున్నారు.

ఈ ఏడాది 'అలయ్ బలయ్' వేడుకలను అక్టోబర్ 22న నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులను దత్తాత్రేయ స్వయంగా కలిసి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌లను కూడా ఆయన ఆహ్వానించారు. అలాగే కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ తదితరులకు సైతం ఆహ్వానాలు అందించినట్లు సమాచారం.
చంద్రబాబు ఈ వేడుకకు హాజరుకానుండటం రాజకీయంగా కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య స్నేహపూర్వక సంబంధాలు, తెలుగు ప్రజల ఐక్యత, పరస్పర సహకారం వంటి అంశాలపై దత్తాత్రేయ-చంద్రబాబు భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఒకే వేదికపై కలుసుకునే అవకాశం ఉండటంతో ఈసారి అలయ్ బలయ్ కార్యక్రమంపై మరింత ఆసక్తి నెలకొంది.

