KTR : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సిరిసిల్ల పర్యటన సందర్భంగా తన హోటళ్ల వ్యాపారాన్ని ప్రస్తావించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
తాను గతంలోనే తన వ్యాపార వివరాలను ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్నానని కేటీఆర్ తెలిపారు. తనకు హోటల్ వ్యాపారం ఉందని సీఎం రేవంత్రెడ్డి చెప్పడం కొత్త విషయాన్ని కనుగొన్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. తన భార్య, పిల్లలను పోషించేందుకు తాను వ్యాపారం చేస్తున్నానని, ప్రస్తుతం తనకు మూడు హోటళ్లు ఉన్నాయని చెప్పారు.

రాజకీయాలకు రాకుండా ఉంటే 10 హోటళ్లు ఉండేవి: కేటీఆర్
రాజకీయాల్లోకి రాకుండా పూర్తిస్థాయిలో వ్యాపారంపైనే దృష్టి పెట్టి ఉంటే ఇప్పటికి తనకు పది హోటళ్లు ఉండేవని కేటీఆర్ పేర్కొన్నారు. రాజకీయాల్లోకి రావడం వల్ల వ్యాపార విస్తరణపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేకపోయానని చెప్పారు. తన హోటళ్ల గురించి సీఎం రేవంత్రెడ్డి చేసిన ప్రస్తావనకు వ్యంగ్యంగా స్పందిస్తూ, తన వ్యాపారానికి ఉచితంగా ప్రచారం కల్పించినందుకు థ్యాంక్స్ అని అన్నారు. ఇదిలా ఉండగా, కేటీఆర్ హోటళ్ల వ్యాపారం, ఎన్నికల అఫిడవిట్లలో ఆస్తుల వివరాల ప్రస్తావనపై కాంగ్రెస్ నేతలు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దీంతో రేవంత్రెడ్డి వ్యాఖ్యలు, కేటీఆర్ కౌంటర్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

