CM Vijay Birthday Gift : తమిళనాడు రాజకీయాల్లో సంచలనాలు సృష్టిస్తున్న ముఖ్యమంత్రి విజయ్ తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా సరికొత్త, వినూత్నమైన సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే ప్రతి శిశువుకు ఒక గ్రాము బంగారు ఉంగరాన్ని (Gold Ring) బహుమతిగా అందించనున్నట్లు ఆయన ప్రకటించారు. గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ, ఈ పథకానికి ‘తాయ్ మామన్ గోల్డ్ రింగ్ స్కీమ్’ (Thai Maman Gold Ring Scheme – మేనమామ బంగారు ఉంగరం పథకం) అని నామకరణం చేశారు. ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని సెప్టెంబర్ 15వ తేదీన అధికారికంగా ప్రారంభించనున్నారు. విశేషమేమిటంటే, అదే రోజున డీఎంకే (DMK) వ్యవస్థాపకుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి సి.ఎన్. అన్నాదురై జయంతి కావడం గమనార్హం.

జూన్ 22 నుంచి పుట్టిన వారికి వర్తింపు.. ‘తాయ్ మామన్’ సెంటిమెంట్!
ఈ పథకం అమలు తేదీపై ప్రభుత్వం కీలక స్పష్టతనిచ్చింది. ఈ ఏడాది ముఖ్యమంత్రి విజయ్ పుట్టినరోజైన జూన్ 22వ తేదీ నుండి ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించిన శిశువులందరూ ఈ బంగారు ఉంగరం పథకానికి అర్హులుగా గుర్తిస్తారు. తమిళ సంస్కృతిలో పుట్టిన పిల్లలకు మేనమామ (తాయ్ మామన్) బంగారు నగలు ప్రెసెంట్ చేయడం ఒక పవిత్రమైన సెంటిమెంట్‌గా భావిస్తారు. ఈ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకుంటూ, ప్రభుత్వమే ప్రతి బిడ్డకు మేనమామగా మారి ఈ గిఫ్ట్ అందిస్తుందని ప్రకటించడం ద్వారా విజయ్ ప్రజల్లోకి బలంగా దూసుకెళ్తున్నారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల సంఖ్య పెరగడమే కాకుండా, పేద కుటుంబాలకు ఆర్థికంగా ఒక భరోసా లభిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

