Odisha ATM Robbery: ఒడిశా రాష్ట్రంలో అత్యంత సాహసోపేతమైన, విస్తుపోయే రీతిలో ఒక ఏటీఎం దోపిడీ వెలుగుచూసింది. బాలాసోర్ జిల్లాలోని తురిగడియా మార్కెట్ సమీపంలో గుర్తుతెలియని కొందరు దుండగులు సరికొత్త వ్యూహంతో ఏటీఎంను కొల్లగొట్టారు.
సాధారణంగా ఏటీఎం సెంటర్లలోకి చొరబడి గ్యాస్ కట్టర్లతో మిషన్లను పగులగొట్టే దొంగలను చూసుంటాం. కానీ ఇక్కడ దొంగలు ఏకంగా హాలీవుడ్ యాక్షన్ సినిమా రేంజ్‌లో ఏటీఎం మిషన్‌నే కారుకు కట్టి పెకిలించుకుపోయారు. ఈ విచిత్రమైన దోపిడీ ఉదంతం ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం తెల్లవారుజామున దాదాపు 2 గంటల సమయంలో దొంగలు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. పక్కా ప్లాన్‌తో వచ్చిన దుండగులు ఒక మహీంద్రా థార్ (Mahindra Thar) ఎస్‌యూవీ వాహనాన్ని ఏటీఎం సెంటర్ ముందుకు తీసుకొచ్చారు. ఆ కారు వెనుక భాగానికి బలమైన తాడు లేదా చైన్‌ను అమర్చి, లోపల ఉన్న ‘ఇండియా వన్’ (India One ATM) ఏటీఎం మిషన్‌కు గట్టిగా కట్టేశారు. ఆ తర్వాత కారును వేగంగా ముందుకు పోనివ్వడంతో, ఆ ధాటికి ఏటీఎం మిషన్ కియోస్క్ బేస్ నుండి ఊడి బయటకు వచ్చేసింది.
Movie-style heist: Thieves drag away ATM machine after tying it to a Thar SUV.
Odisha ATM Robbery: రోడ్డుపై ఈడ్చుకెళ్లి.. నగదుతో పరారీ!
ఆలయాలు, ఇళ్లు ఉన్న ఆ పరిసర ప్రాంతంలో జనాలు నిద్రిస్తున్న వేళ.. కారుకు కట్టిన ఆ ఏటీఎం మిషన్‌ను అలాగే రోడ్డుపై దాదాపు 200 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లారు. ఆపై నిర్మానుష్య ప్రాంతంలో కారును ఆపి, పారలు, ఇతర ఇనుప రాడ్లతో ఏటీఎం మిషన్‌ను పగులగొట్టారు. అందులో ఉన్న భారీ నగదును మొత్తం సర్దేసుకుని మిషన్‌ను అక్కడే వదిలేసి థార్ కారులో పారిపోయారు. ఉదయాన్నే రోడ్డుపై పడి ఉన్న మిషన్‌ను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఈ ఘోర దోపిడీ సంఘటనకు సంబంధించిన కొన్ని విజువల్స్ స్థానిక సీసీటీవీ (CCTV) కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ దృశ్యాల ఆధారంగా బాలాసోర్ జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. దొంగలు వాడిన మహీంద్రా థార్ కారు నంబర్ ప్లేట్ ఆధారంగా, అలాగే వారు ప్రయాణించిన రూట్ మ్యాప్‌ను ట్రాక్ చేస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఏమైనా ఈ పని చేసిందా అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు.
భవిష్యత్ యుద్ధాల్లోనూ విజయం దృఢ సంకల్పం, సైనికుల వల్లే సాధ్యమవుతుంది..రాజ్‌నాథ్ సింగ్

