Suvendu Adhikari PA: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించిన రెండు రోజులకే ఆ పార్టీ నేత, గెయింట్ కిల్లర్ సువేందు అధికారి పీఏ చంద్రనాథ్ రథ్ దారుణ హత్యకు గురయ్యారు.
మధ్యమ్‌గ్రామ్‌లో కారులో వెళ్తున్న చంద్రనాథ్ రథ్‌పై దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరపగా, మూడు బుల్లెట్లు ఆయనకు తగిలాయి. కారు వేగం తగ్గిన సమయంలో నిందితులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కారు డ్రైవర్ బుద్ధదేవ్ కూడా గాయపడటంతో ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Read Also:Telangana: అంతర్రాష్ట్ర దొంగల ముఠాల కదలికలు: చుట్టం చూపులా వచ్చి దోచుకెళ్తున్న వైనం
సువేందు అధికారి ఇన్నర్ సర్కిల్ సభ్యుడు
చంద్రనాథ్ రథ్ చాలా ఏళ్లుగా సువేందు అధికారి వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్నారు. రాజకీయ సమన్వయం, ఇతర ముఖ్యమైన పనులను ఆయనే పర్యవేక్షించేవారు. సువేందు అధికారి ఇన్నర్ సర్కిల్‌లో చంద్రనాథ్ కీలక సభ్యుడిగా ఉన్నారు..
రాజకీయ ఆరోపణలు – సీబీఐ దర్యాప్తుకు డిమాండ్
ఈ హత్య వెనుక తృణమూల్ కాంగ్రెస్ (TMC) హస్తం ఉందని సువేందు అధికారి సోదరుడు దిబ్యేందు అధికారి ఆరోపించారు. ఈ కేసుపై సీబీఐ (CBI) దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. టీఎంసీ సాగించిన హింసాత్మక సంస్కృతికి ఈ ఘటనే నిదర్శనమని, దీని వెనుక లోతైన కుట్ర దాగి ఉందని బీజేపీ నేతలు నిఖిల్ ప్రసూన్, దేవదాస్ మోండల్ విమర్శించారు. ఒక అమాయకుడిని పొట్టనబెట్టుకున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Suvendu Adhikari PA: స్పందించిన తృణమూల్ కాంగ్రెస్
మరోవైపు, ఈ హత్యను తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. గత మూడు రోజులుగా బీజేపీ మద్దతుదారులు హింసకు పాల్పడుతున్నారని, ముగ్గురు టీఎంసీ కార్యకర్తలు కూడా హత్యకు గురయ్యారని సోషల్ మీడియా వేదికగా ఆరోపించింది. కాగా, మధ్యమ్‌గ్రామ్ నియోజకవర్గంలో టీఎంసీ నేత రతిన్ ఘోష్ స్వల్ప మెజారిటీతో విజయం సాధించిన నేపథ్యంలో ఈ ఉద్రిక్తతలు చోటుచేసుకోవడం గమనార్హం.
పోలీసుల చర్యలు
ఎన్నికల అనంతర హింసను అరికట్టేందుకు కోల్‌కతా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పోలీస్ చీఫ్ అజయ్ కుమార్ నంద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు 80 మందిని అరెస్ట్ చేయగా, 65 మందిని కస్టడీలోకి తీసుకున్నారు. మరో 15 మందిని ముందుజాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. భవానీపూర్ సీటులో మమతా బెనర్జీని ఓడించి ముఖ్యమంత్రి రేసులో ఉన్న సువేందు అధికారి పీఏ హత్యకు గురవ్వడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
టెక్నాలజీతో ఆడిన మాయాజాలం: శ్రీనివాస్ కిరణ్ బాబు మోసాల వెనుక అసలు కథ

